రానా నిర్మాత.. రాజ్ తరుణ్ హీరో

రానా నిర్మాత.. రాజ్ తరుణ్ హీరో

తొమ్మిదేళ్ల కిందట ‘లీడర్’ అనే సినిమా రిలీజైనపుడు దగ్గుబాటి రానాను ఎవ్వరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు రానా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాడు. హీరోగా ‘నా ఇష్టం’ అనే సినిమా చేసే సమయానికైతే అతడి పరిస్థితి దయనీయంగా ఉంది. ఐతే హీరోగానే కంటిన్యూ అవ్వాలని అతను గిరి గీసుకుని కూర్చుని ఉంటే కెరీర్ మరింత పతనం అయ్యేదే. ఈపాటికి ఏ తారకరత్న లాగో అడ్రస్ లేకుండా పోయేవాడేమో.

క్యారెక్టర్, విలన్ రోల్స్ చేయడానికి ముందుకొచ్చి వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకోవడం.. వాటి కోసం ప్రాణం పెట్టి పని చేయడంతో రానా విలువ పెరిగింది. ఇప్పుడు అతనో బ్రాండ్ లాగా కనిపిస్తున్నాడందరికీ. ‘బేబీ’.. ‘ఘాజీ’.. ‘బాహుబలి’ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన అతను  వివిధ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. అతనిప్పుడు నిర్మాతగా, నటుడిగా ఓ వెరైటీ ప్రాజెక్టును లైన్లో పెట్టాడు.

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్‌తో కలిసి రానా ఓ బహుభాషా చిత్రాన్ని నిర్మించనున్నాడు. మరాఠీలో సూపర్ హిట్టయిన ‘పోస్టర్ బాయ్స్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారట. ఈ సినిమా గురించి చాన్నాళ్ల కిందటే ప్రకటన వచ్చింది కానీ.. మధ్యలో అది వార్తల్లో లేకుండా పోయింది. ఏ అప్ డేట్ లేదు. ఐతే త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తాడని సమాచారం.

రాజ్ ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా అతడికి ఈ సినిమాలో అవకాశం కల్పిస్తున్నారు. అన్ని భాషలకూ రానా, అక్షయ్ నిర్మాతలుగా వ్యవహరించడమే కాదు.. క్యామియో రోల్స్ కూడా చేస్తారట. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. రానా ప్రస్తుతం ‘హాథీ మేరీ సాథీ’ అనే మల్టీలాంగ్వేజ్ సినిమాలోో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English