‘అమేజాన్’లో ఇకపై ‘పే పర్ వ్యూ’?

ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే చాలు.. అమేజాన్ ప్రైంలో వివిధ భాషల్లో వేలల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసుకోవచ్చు. పాత కంటెంట్‌తో సరిపెట్టకుండా.. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లూ అందిస్తూనే ఉంటుంది ఆ సంస్థ.

మిగతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌తో పోలిస్తే ప్రైమ్‌లో కంటెంట్ ఎక్కువ, సబ్‌స్క్రిప్షన్ ఫీజు తక్కువ. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ భారీగా పెట్టుబడి పెడుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొత్త సినిమాలు కొంటూనే ఉంటుంది. ఒరిజినల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంటుంది.

సబ్‌స్క్రైబర్లు భారీగా పెరుగుతున్నప్పటికీ.. వచ్చే రాబడికి, పెట్టే పెట్టుబడికి ఎలా బ్యాలెన్స్ అవుతుందో అన్న సందేహం చాలా మందిలో ఉంది. అందులోనూ ఈ మధ్య ఇంకా థియేటర్లలో విడుదల కాని సినిమాలను కాస్త ఎక్కువ డబ్బులే పెట్టి కొంటోంది ఆ సంస్థ. వివిధ భాషల్లో అరడజను పేరున్న సినిమాలను ఇలాగే ప్రైమ్ వాళ్లు కొన్నారు.

ఇలా కొత్త సినిమాలను అందిస్తే సబ్‌స్క్రైబర్లు పెరిగి ఆ రకంగా ఆదాయం సమకూరుతుందన్నది ఆ సంస్థ ప్రణాళిక. కానీ ఇలా ఎంతో కాలం నెట్టుకురాలేమని.. సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చే ఆదాయాన్నే నమ్ముకుంటే భారం అవుతుందని ప్రైమ్ యాజమాన్యం ఆలోచిస్తోందట. ఈ నేపథ్యంలో ‘పే పర్ వ్యూ’ పద్ధతిని తేవాలని చూస్తున్నట్లు సమాచారం.

అంటే ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్‌కు తోడు.. కొన్ని ఎక్స్‌క్లూజివ్, భారీ చిత్రాలు చూసేందుకు వేరేగా నిర్దిష్ట మొత్తంలో ఖర్చు చేయాలన్నమాట. ఇప్పటికే యూట్యూబ్‌లో ఈ ఏర్పాటు ఉంది. కొన్ని స్పెషల్ మూవీస్‌కు ఇలా రేటు పెడతారు. రూ.25 నుంచి రూ.100 వరకు రేటు ఉంటుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేస్తున్న ‘క్లైమాక్స్’ సినిమాకు పే పర్ వ్యూ పద్ధతిలోనే రూ.100 రేటు నిర్ణయించారు.

ఐతే ప్రైమ్ వాళ్లు ఇలా ఎక్కువ భారం మోపకుండా రూ.10-20 మధ్య రేటుతో ‘పే పర్ వ్యూ’ను తీసుకురావాలని చూస్తున్నారట. అలా చేస్తే తప్ప తమకు ఆర్థికంగా వర్కవుట్ కాదని, ఆదాయం పెరగదని, కొత్త సినిమాలు కొనలేమని ఆ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.