ఆరు ఆస్కార్ల సినిమా ఆమిర్ చేతికి

ఆరు ఆస్కార్ల సినిమా ఆమిర్ చేతికి

బాలీవుడ్లో ఆమిర్ ఖాన్‌కు ఉన్న క్రెడిబిలిటీ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి సినిమా అంటే కచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకంతో కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతుంటారు ప్రేక్షకులు. గత రెండు దశాబ్దాల్లో ఆమిర్ ఖాన్ నుంచి వచ్చిన సినిమాలు అతడి మీద ప్రేక్షకుల్లో అలాంటి నమ్మకం కలిగించాయి.

‘దిల్ చాహ్‌తా హై’ దగ్గర్నుంచి ‘దంగల్’ వరకు అతడి జైత్రయాత్ర అసాధారణ రీతిలో సాగింది. మధ్యలో ‘ది రైజింగ్’ మినహాయిస్తే అతడికి అపజయమే లేదు. ఐతే గత ఏడాది ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మాత్రం ఆమిర్‌పై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసింది. డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత ఆమిర్ తన తర్వాతి సినిమా గురించి ఏ సమాచారమూ ఇవ్వలేదు. అతను ‘మహాభారతం’ మీద తన టీంతో కలిసి పని చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఆ సంగతి కూడా ఖరారు కాలేదు.

ఐతే తాజాగా ఆమిర్ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. అతను ఓ హాలీవుడ్ రీమేక్‌లో నటించబోతున్నాడట. ఆ సినిమా హక్కులు తనే స్వయంగా సొంతం చేసుకున్నాడట. ఆ సినిమా మరేదో కాదు.. హాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘ఫారెస్ట్‌ గంప్‌’. ప్రఖ్యాత నటుడు టామ్‌ హాంక్స్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయం సాధించడమే కాదు 6 ఆస్కార్‌ పురస్కారాలను కూడా గెలుచుకుంది. ఆమిర్‌ ఖాన్‌ను చాలామంది టామ్ హాంక్స్‌తోనే పోలుస్తుంటారు. పాత్ర కోసం ఎలా అయినా మారిపోతాడతను. ఏ క్యారెక్టర్ చేస్తే అందులోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ‘ఫారెస్ట్ గంప్’లో కూడా అలాగే నటించి మెప్పించాడు.

ఆమిర్ ఆ సినిమా మీద కన్నేశాడని తెలియగానే ఓ వర్గం ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ కలుగుతోంది. బాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంతకుముందులాగా సైలెంటుగా హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టేయకుండా ఇప్పుడు రీమేక్ హక్కులు కొనుగోలు చేసి సినిమాలు తీస్తున్నారు. ఆమిర్ కూడా అదే పని చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English