మోహన్ బాబు టాలీవుడ్‌ను వదిలేసి...

మోహన్ బాబు టాలీవుడ్‌ను వదిలేసి...

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు మంచు మోహన్ బాబు. 550కి పైగా సినిమాలు.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విలక్షణ పాత్రలు.. మరెన్నో పురస్కారాలు.. చెప్పడానికి చాలా గొప్ప చరిత్రే ఉందాయనకు. కానీ ఆయన అనుభవాన్ని ఇప్పుడు టాలీవుడ్లో ఎవ్వరూ ఉపయోగించుకోవట్లేదు.

మోహన్ బాబు తనకు తానుగా సినిమాలు తగ్గించుకోగా.. ఆయన్ని సంప్రదించేవాళ్లు కూడా తగ్గిపోయారు. హీరోగా ఆయన గత కొన్నేళ్లలో చేసిన సినిమాలు దారుణ ఫలితాలందుకున్నాయి. గత ఏడాది ‘గాయత్రి’ తర్వాత ఇక తెలుగులో సినిమాలే చేయొద్దన్న నిర్ణయానికి వచ్చేశారు మోహన్ బాబు. ‘మహానటి’లో క్యామియో మినహాయిస్తే మరే సినిమాలోనూ నటించలేదు. ఐతే ఇప్పుడాయన దృష్టి తమిళ సినిమాలపై పడ్డట్లు సమాచారం.

మణిరత్నం తీయబోయే ‘పొన్నియన్ సెల్వన్’లో మోహన్ బాబు ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. ఈ విషయమై సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా రాబోయే కొత్త సినిమాలో మోహన్ బాబు నటిస్తాడన్న వార్త ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ‘ఎన్జీకే’తో పాటు ‘కాప్పన్’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు సూర్య. దీని తర్వాత లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో అతను ఓ సినిమా చేయబోతున్నాడు.

‘గురు’తో సత్తా చాటిన సుధ.. చాలా గ్యాప్ తీసుకుని తన కొత్త సినిమా స్క్రిప్టు తయారు చేసింది. తెలుగమ్మాయి అయిన సుధ.. ఇందులో మోహన్ బాబు కోసం ఒక ప్రత్యేక పాత్ర తీర్చిదిద్దిందట. సూర్యకు తెలుగు మార్కెట్ మీద ఉన్న ఫోకస్ ఎలాంటిదో తెలిసిందే. మోహన్ బాబు తమిళులకూ పరిచయమే. కాబట్టి ఆయన్ని పెట్టుకుంటే రెండు రకాలుగా కలిసొస్తుందని అనుకుంటున్నారట. మోహన్ బాబు ఓకే చేస్తే ఈ సినిమాకు భలే క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English