ఒక్క కమిట్మెంట్.. జీవితాన్ని మార్చేసింది

ఒక్క కమిట్మెంట్.. జీవితాన్ని మార్చేసింది

‘రన్ రాజా రన్’ అనే చిన్న సినిమా తీసిన సుజీత్ అనే కుర్ర దర్శకుడు దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘సాహో’ లాంటి హై ప్రొఫైల్ ప్రాజెక్టును డీల్ చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అతడి వయసిప్పుడు కేవలం 27 ఏళ్లు. సినీ రంగంలో పెద్దగా పని చేసింది కూడా లేదు. షార్ట్ ఫిలిమ్స్‌తో సత్తా చాటుకుని.. ఆపై ‘రన్ రాజా రన్’తో మెప్పించాడు. ఈ సినిమా రిలీజయ్యే సమయానికి ప్రభాస్ మామూలు హీరోనే. దీంతో సుజీత్‌కు కమిట్మెంట్ ఇవ్వడానికి పెద్దగా ఆలోచించలేదు.

కట్ చేస్తే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అతడి స్థాయికి తగ్గట్లే ‘సాహో’ రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్‌కి సుజీత్ దర్శకుడు. ఒక కమిట్మెంట్ ఎలా జీవితాన్ని మార్చేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

ఈ స్థాయిలో కాకపోయినా మరో యువ దర్శకుడి జీవితం కూడా ఒక కమిట్మెంట్ కారణంగా ఊహించని మలుపు తిరిగింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘డియర్ కామ్రేడ్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడతను. అతను కూడా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సత్తా చాటుకున్నవాడే. విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చేస్తున్న సమయంలో అతడితో భవిష్యత్తులో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఆ హామీతో ఒక కథ రెడీ చేసుకున్నాడు.

ఐతే అతను స్క్రిప్టు రెడీ చేసి, విజయ్ రెడీ అయ్యే సమయానికి కథ మారిపోయింది. విజయ్ పెద్ద స్టార్ అయిపోయాడు. ముందు చిన్న సినిమాగా అనుకున్న ‘డియర్  కామ్రేడ్’ రేంజ్ మారిపోయింది. వేరే నిర్మాతలు చేయాల్సింది కాస్తా.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ చేతుల్లోకి వెళ్లింది. బడ్జెట్ పెరిగింది. మేకింగ్ స్థాయి పెరిగింది. విజయ్ క్రేజ్ చూసుకుని దీన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. దీని బిజినెస్ రూ.100 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ఇంత స్పాన్ ఉన్న సినిమా చేస్తానని భరత్ అసలు ఊహించి ఉండడేమో. విజయ్ నుంచి కమిట్మెంట్ తీసుకోవడం అతడి కెరీర్‌కు గొప్ప ఆరంభాన్నే ఇచ్చేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English