డియర్ కామ్రేడ్.. దక్షిణాది ధమాకా

డియర్ కామ్రేడ్.. దక్షిణాది ధమాకా

‘అర్జున్ రెడ్డి’.. ‘గీత గోవిందం’ సినిమాలతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘ట్యాక్సీవాలా’ సైతం సూపర్ హిట్ కావడంతో విజయ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు అతడి నుంచి రానున్న ‘డియర్ కామ్రేడ్’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది.

సైలెంటుగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టేశారు. ఇక ప్రమోషన్ హడావుడి మొదలు కాబోతోంది. ముందుగా టీజర్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. ఒక బ్యాంగ్ బ్యాంగ్ అప్ డేట్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు. మార్చి 17న ‘డియర్ కామ్రేడ్’ టీజర్ విడుదలవుతుందట. అది ఒక భాషలో కాదు.. ఒకేసారి నాలుగు భాషల్లో కావడం విశేషం.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ.. ఈ నాలుగు భాషల్లోనూ ఒకేసారి టీజర్ లాంచ్ చేయబోతున్నారు. అంటే ఈ నాలుగు భాషల్లోనూ ఒకేసారి సినిమా రిలీజవుతుందన్నమాట. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దక్షిణాదిన అంతటా విజయ్‌కి క్రేజ్ వచ్చింది. తమిళంలో అయితే అతడిని ఒక స్టార్ లాగే చూస్తున్నారు జనాలు.

ఆల్రెడీ అక్కడతను ‘నోటా’ సినిమా కూడా చేశాడు. కేరళలోనూ కొంత ఫాలోయింగ్ వచ్చింది. ఇక ‘డియర్ కామ్రేడ్’ హీరోయిన్ రష్మిక మందన్నా కన్నడ అమ్మాయన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే అక్కడ డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఎత్తేశారు. దీంతో ‘డియర్ కామ్రేడ్’ను కన్నడలోనూ రిలీజ్ చేసే అవకాశం వచ్చింది. మేలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆలోపు నాలుగు భాషల్లోనూ పక్కాగా సినిమాను రెడీ చేసి ఒకేసారి రిలీజ్ చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందిస్తున్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English