రాజశేఖర్ సినిమా ఫ్రీ

రాజశేఖర్ సినిమా ఫ్రీ

రెండేళ్ల ముందు సీనియర్ హీరో రాజశేఖర్ పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. ఆయన పూర్తిగా మార్కెట్ కోల్పోయి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోయే పరిస్థితిలో ఉన్నాడు. నాలుగైదేళ్ల ముందే ఆయన కెరీర్ ముగింపు దశకు వచ్చేసింది. ఒక దశలో సినిమాలు మానేసి ఖాళీగా ఉండిపోయాడు. ఆయన అప్పటికే పూర్తి చేసిన సినిమాలు కొన్ని మరుగున పడిపోయాయి. ఐతే ‘గరుడ వేగ’తో అనూహ్యంగా మళ్లీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన్నుంచి వస్తున్న ‘కల్కి’కి మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇది కూడా పెద్ద బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమానే. ఈ చిత్రానికి ఆల్రెడీ బిజినెస్ మొదలైనట్లు సమాచారం. ఈ సినిమాను కొంటున్న వాళ్లకు సి.కళ్యాణ్ ఒక ఆఫర్ ఇస్తున్నారట. రాజశేఖర్ హీరోగా తాను నిర్మించిన ఓ చిత్రాన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారట.

ఆ సినిమా పేరు.. అర్జున. ఇంతకుముందు ‘నా ఊపిరి’.. ‘చిన్నోడు’ లాంటి సినిమాల్ని రూపొందించిన తమిళ దర్శకుడు కణ్మణి రూపొందించిన చిత్రమిది. ఐదేళ్ల కిందటే దీన్ని పూర్తి చేశారు. కానీ రాజశేఖర్ మార్కెట్ జీరో అయిపోయి ఆయన సినిమాల్ని జనాలు పట్టించుకునే పరిస్థితే లేకపోవడంతో దాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితుల్లో దాన్ని పక్కన పెట్టేశారు. ఐతే ఇప్పుడు రాజశేఖర్ మళ్లీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఎలాగూ ఊరికే పడి ఉంది కదా అని దాన్ని బయ్యర్లకు అంటగడుతున్నారు. ‘కల్కి’ కంటే ముందే దీన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాజశేఖర్ కుర్రాడిగా, పెద్ద వయస్కుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ‘కల్కి’ సినిమా ఈ ఏడాది వేసవిలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English