టీఆర్‌ఎస్ లో హరీష్ రావుకు గడ్డుకాలం!

హుజూరాబాద్.. ఈ ఎన్నిక టీఆర్ఎస్‌కు గట్టి షాకే ఇచ్చింది. తెలంగాణా రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా ఆకాశంలో విహరిస్తున్న కేసీఆర్‌ను ఈ ఎన్నిక నేలపైకి దింపిందంటే అతిశయోక్తి కాదు. టీఆర్ఎస్ భవిష్యత్తుపైనే ప్రశ్నలు లేవనెత్తిన ఎన్నిక ఇది.

ఇక టీఆర్ఎస్ తరువాత అంతటి మాస్ నాయకుడిగా గుర్తింపు ఉన్న హరీష్ రావు కూడా ఈ ఎన్నికల తరువాత గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీజేపీని ఓడించేందుకు రెండు సార్లు బరిలోకి దిగి ఓటమి మూటగట్టుకోవడానికి గల కారణమేమిటనేదానిపై హరీష్ ఇలాకా సిద్దిపేటలోనే విస్తృత చర్చ జరుగుతోంది. హరీష్ అంటే టీఆర్‌ఎస్ లో ట్రబుల్ షూటర్.. ఇప్పుడు ఆ ట్రబుల్ షూటరే ట్రబుల్ లో పడ్డారు. హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నిక ఓటమితో ట్రబుల్ షూటర్ చరిత్ర మసకబారుతుంది.

టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గులాబి పార్టీలో తురుపుముక్కగా పేరు పొందిన హరీష్ దుబ్బాక, హుజురాబాద్ లో మాత్రం ప్రభావం చూపలేక పోయారు. ఈ రెండు చోట్ల గెలిచిన పార్టీ ఒక్కటే కావడం కాకతాళీయం. ఇక్కడే అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. హరీష్ మంత్ర బీజేపీపై పనిచేయడం లేదా? మేనమామ కేసీఆర్ కు ఇచ్చిన మాటను హరీష్ ఎందుకు నిలబెట్టుకోలేపోయారు? లేక పోతే అక్కడ గెలవలేమని ముందే పసిగట్టి హరీష్ ను అక్కడి పంపుతున్నారా? ఇలా అనేక ప్రశ్నలు గులాబి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

సీజన్ వన్ లో తిరుగులేని వ్యూహకర్తగా పేరుగాంచిన హరీష్.. రెండో సీజన్ లో మాత్రం పేలవమైన పదర్శనతో అప్రతిష్ట మూట కట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. రెండోసారి టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అన్ని తానై టీఆర్‌ఎస్ ను గెలిపించుకుందుకు నడుం బిగించారు. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి, హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు. అక్కడ కూడా హరీష్ మంత్రం బీజేపీ దగ్గర పనిచేయలేదు. ఆ తర్వాత హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేశారు. ఈ రెండు చోట్ల టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ హరీష్ రావే. దుబ్బాకలో సోలిపేట సుజాత, హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ.. పోటీలో ఉన్నది హరీష్‌రావే అన్నట్లు సీన్‌ క్రియేట్‌ చేశారు. ఇక్కడ కర్త, కర్మ, క్రియ హరీష్ రావే అన్నట్లు పోరు సాగింది. అయితే అటు దుబ్బాకలో, ఇటు హజురాబాద్‌లో కారుకు బీజేపీ ఫంక్చర్ చేసింది. దీంతో గులాబి శిబిరంలోనే కాదు అన్ని చోట్ల ఆయనపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.

భవిష్యత్తులో జరిగే ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తే అంతే సంగతులనే ప్రచారం గులాబి పార్టీల్లో జోరుగా సాగుతోంది. ఈ రెండు ఎన్నికలు ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేశాయనే విశ్లేషణలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఆయన ఓ ఆట ఆడుకున్నారు. ఫలానా అభ్యర్థులను అసెంబ్లీలో అడుగుపెట్టాలని.. కేసీఆర్ ఆదేశిస్తే ఈ పనిని ఇట్లే పూర్తి చేసి శభాష్ అని అనిపించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీకే అరుణ, రేవంత్ రెడ్డిలను ఓడించిన సందర్భాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీయే కాదు రాజకీయాలు గమనించే ఎవరూ మర్చిపోలేరు. ఇప్పటికీ ఆ విషయాలను గుర్తుచేస్తుంటారు.

హరీష్ రావు బాధ్యతలు తీసుకున్న నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోవడంపై ఇతర పార్టీల్లో ఎలా ఉన్నా టీఆర్‌ఎస్ లో మాత్రం హరీష్ కేంద్రంగా ఏదో జరుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుబ్బాక, హుజురాబాద్ లో హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు, కీలక నేతలు ప్రచారం చేశారు. కానీ ఓటమికి హరీష్ రావే బాధ్యుడు అన్నట్లుగా సీన్ క్రియేట్ అయింది. ఇప్పుడు టీఆర్‌ఎస్ ను ఓడిచేందుకు విపక్షాలన్నీ ఒకే తాటిపైకి వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సాక్ష్యంగా హుజురాబాద్ ను చూపిస్తున్నారు. ఈటల గెలుపుకు కాంగ్రెస్ సహకరించిందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షపార్టీలు హరీష్‌ టార్గెట్ గా దండయాత్రకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే హరీష్ రావును ఈటల టార్గెట్ చేసుకుని సిద్ధిపేటలో దళిత గర్జన సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

రెండు చోట్ల టీఆర్‌ఎస్ ఓటమి తర్వాత హరీష్ రావు శ్రేయోభిలాషులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సులభంగా గెలిచే చోట్ల కేసీఆర్, కేటీఆర్ రెక్కటు కట్టుకుని వాలిపోతారని, గెలుపు అసాధ్యమైన ప్రాంతాల్లో హరీష్ రావును దింపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను హీరో చేసి, హరీష్ ను జీరో చేసేందుకు ఇలా చేస్తున్నారని హరీష్ సన్నిహితులు చెబుతున్నారు.