లేదు లేదన్నారు కానీ చేస్తున్నారు

లేదు లేదన్నారు కానీ చేస్తున్నారు

తమిళనాట తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకడు. మొన్న సంక్రాంతికి అతడి సినిమా ‘విశ్వాసం’.. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘పేట్ట’తో పోటీ పడి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం. మామూలుగా రికార్డులు బద్దలు కొట్టడం ఒకెత్తయితే.. పోటీలో మరో భారీ సినిమా ఉండగా రికార్డు సాధించడం మరో ఎత్తు.

దీన్ని బట్టే అజిత్ తమిళనాట ఇప్పుడు ఎంత పెద్ద హీరో అనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఐతే మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన అజిత్.. హిందీలో విజయవంతమైన క్లాస్ మూవీ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్నట్లుగా గత ఏడాది వార్తలు వస్తే జనాలు నమ్మలేదు. అజిత్ ఏంటి.. ఫైట్లు, హీరోయిజం లేని కోర్ట్ రూం డ్రామాలో నటించడం ఏంటి అని ప్రశ్నించారు. అజిత్ చేయబోయేది ‘పింక్’ రీమేక్ అని జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు హెచ్.వినోద్ కూడా ఖండించడంతో ఈ వార్తలో నిజం లేదనే అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా ప్రారంభమైన సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అందరి అభిప్రాయాలు మారిపోయాయి. ఇది పక్కాగా ‘పింక్’ రీమేక్ అని స్పష్టం అయిపోయింది. ఇందులో అజిత్ లాయర్‌లో లుక్‌లో కనిపిస్తున్నాడు. కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు ఇంకో ఇద్దరమ్మాయిలు కోర్టు బోనులో ఉన్నారు. ఈ పోస్టర్ చూశాక ఇది ‘పింక్’ రీమేక్ కాదని ఎలా అనుకుంటాం. పైగా ‘పింక్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నట్లు గతంలో ప్రకటించిన బోనీ కపూరే ఈ చిత్రానికి నిర్మాత కూడా. కాబట్టి ఇక సందేహాలేమీ అక్కర్లేదన్నట్లే. ‘పింక్’ను తమిళంలో తీయాలన్నది శ్రీదేవి కోరిక.

ఆమె ఉండగానే ఈ ప్రపోజల్ వచ్చింది. శ్రీదేవికి స్నేహితుడైన అజిత్.. గతంలో ఆమె కోసం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో ఒక అతిథి పాత్ర కూడా చేశాడు. శ్రీదేవి మీద గౌరవంతోనే, ఆమెకు నివాళిగా ‘పింక్’ రీమేక్‌లో నటించడానికి అజిత్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బహుశా అజిత్ ఇమేజ్‌కు తగ్గట్లుగా తమిళంలో మార్పులు చేర్పులు చేయొచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English