ఎఫ్-2కి 50 రోజులు.. రేర్ ఫీట్

ఎఫ్-2కి 50 రోజులు.. రేర్ ఫీట్

సంక్రాంతి రేసులో చివ‌ర‌గా వ‌చ్చి.. పోటీలో ఉన్న సినిమాల‌న్నింటినీ వెన‌క్కి నెట్టి ముందుకు దూసుకెళ్లిపోయింది ‘ఎఫ్‌-2’. ఆ పండక్కి వచ్చిన మిగతా మూడు సినిమాల వసూళ్లు కలిపితే దీనికి సమానంగా ఉండటం విశేషం. దీనికి బాక్సాఫీస్ దగ్గర అన్ని రకాలుగా కలిసి రావడంతో ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.85 కోట్ల షేర్.. రూ.140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందా సినిమా. ఈ చిత్రం అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకుని కూడా ఇంకా థియేటర్లలో కొనసాగుతుండటం విశేషం. అర్ధశత దినోత్సవాలన్న మాటే వినిపించని ఈ రోజుల్లో ఈ చిత్రం వందకు పైగా సెంటర్లలో 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం గమనార్హం. మొత్తం 106 కేంద్రాల్లో ‘ఎఫ్-2’ డైరెక్టుగా యాభై రోజులాడింది.

పెద్ద పెద్ద సినిమాలు సైతం ఓ పది కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకోవడమంటే కష్టంగా ఉంది. ఇక 50-100 సెంటర్లలో 50 డేస్ అంటే కల అన్నట్లే. ‘బాహుబలి’ లాంటి మెగా హిట్‌కు కూడా సాధ్యం కాని ఘనత ఇది. గత ఏడాది ‘రంగస్థలం’ కూడా ఇలాగే లాంగ్ రన్‌తో ఆశ్చర్యపరిచింది. ఐతే ఆ సినిమాకైనా అర్ధశతదినోత్సవానికి వంద సెంటర్లు పడ్డాయా అంటే డౌటే. అందులోనూ విడుదలైన నెల రోజులకే అమేజాన్‌లోకి వచ్చేశాక కూడా ‘ఎఫ్-2’ 50 రోజులు ఆడటమంటే మాటలు కాదు. తర్వాతి వారాల్లో వచ్చిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోవడం ‘ఎఫ్-2’కు బాగా కలిసొచ్చి ఆ చిత్రం ఊహించని విజయాన్నందుకుంది. విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English