టీడీపీ ముందు జాగ్రత్త పడుతోందా ?

స్ధానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్త పడుతున్నట్లే ఉంది. నామినేషన్లు వేయబోయే తమ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు కొన్ని సూచనలు చేసింది. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే ఆన్ లైన్లో నామినేషన్లు సబ్మిట్ చేసే సౌకర్యం కల్పించటం. ఆ మధ్య జరిగిన స్ధానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల తమ అభ్యర్థులను అధికార వైసీపీ నేతలు నామినేషన్లు కూడా వేయనీయలేదని ఆరోపించింది. కొందరు నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కైనందు వల్లే తమ అభ్యర్ధులు ఇబ్బందులు పడినట్లు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమీషన్ కు లేఖ రాశారు.

నిజంగా టీడీపీ చేసిన ఈ సూచన చాలా మంచిదే. నామినేషన్లు సమర్పిచే సమయంలో అధికారంలో ఉన్న కొందరు నేతలు ప్రత్యర్ధులను ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయి. కాబట్టి ఆన్ లైన్లో నామినేషన్లను సబ్మిట్ చేసే సౌకర్యం కల్పించంటం మంచిదే. కుల ధృవీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే ఇచ్చేలా అధికారులకు కమీషన్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నామినేషన్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

అభ్యర్ధుల నామినేషన్ పత్రాలపై ప్రతి పేజీలోను అధికారులు సంతకాలు చేసి అభ్యర్ధులకు ఎక్నాలెడ్జిమెంట్ ఇవ్వాలని అడిగారు. బెదిరింపులు, సంతకాల ఫోర్జరీ లేకుండా అభ్యర్ధులే వచ్చి సాక్ష్యుల సమక్షంలో తమ నామినేషన్ను ఉపసంహరించుకునే నిబంధన పాటించాలన్నారు. వాలంటీర్లు ప్రచారం చేస్తే సదరు అభ్యర్ధిని పోటీనుండి డీబార్ చేయాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల పరిశీలన అందరి అభ్యర్ధుల ముందే చేయాలన్నారు. కోవిడ్ సమస్యను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని అడిగారు.

టీడీపీ చేసిన సూచనల్లో చాలావరకు ఆచరించదగ్గవనటంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఇలాంటి సూచనలేవీ చేయలేదు. తాము అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాల అభ్యర్ధుల నామినేషన్ల సందర్భంగా ఎంత గొడవ చేశామో మరచిపోయినట్లున్నారు.