ఈసారి కొట్టాలి బాస్

ఈసారి కొట్టాలి బాస్

16 ఏళ్లు.. రెండు హిట్లు.. ఏ హీరోకైనా ఇది దారుణమైన సక్సెస్ రేటే. ఇలాంటి ట్రాక్ రికార్డుతో ఇంకా ఇండస్ట్రీలో కొనసాగడమంటే మాటలు కాదు. కానీ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎలాగోలా బండి నడిపిస్తూ ఉన్నాడు. కెరీర్ ఆరంభంలో సూపర్ హిట్టయిన ‘అతనొక్కడే’ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం అందుకోవడానికి ఇంకో దశాబ్దానికి పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. చివరికి ‘పటాస్’ అతడి ఆకలిని తీర్చింది. కానీ దాని తర్వాత మళ్లీ పాత ఫాంలోకి వెళ్లిపోయాడు. వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు.

గత ఏడాది ‘ఎమ్మెల్యే’ ఓ మోస్తరుగా ఆడినా.. చివరికి ఫ్లాపే అనిపించుకుంది. ఇక ‘నా నువ్వే’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఐతే ఎన్ని ఫ్లాపులొచ్చినా కళ్యాణ్ రామ్ మాత్రం ఎప్పట్లాగే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రేక్షకులకు ఒక కొత్త తరహా సినిమా అందించాలనే ఉద్దేశంతో ‘118’ అనే డిఫరెంట్ థ్రిల్లర్ ట్రై చేశాడు.

శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. కళ్యాణ్ రామ్ మార్కెట్ ఇప్పటికే బాగా దెబ్బ తినేసింది. ఆ ప్రభావం ‘118’పై స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదని సమాచారం. బజ్ కూడా తక్కువగానే ఉంది. కానీ దీని ప్రోమోలు చూస్తే ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపించింది. ఏదేమైనా ఇప్పుడీ సినిమా ఆడటం కళ్యాణ్ రామ్‌కు చాలా చాలా అవసరం. ఇది కూడా పోతే అతడి కెరీర్ చాలా ప్రమాదంలో పడిపోతుంది. కళ్యాణ్ రామ్‌కు ఉన్న ఇమేజ్‌కు.. అతను చేసిన జానర్‌కు వైరుధ్యం ఉంది. కాబట్టి సినిమాకు చాలా మంచి టాక్ వస్తేనే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించేందుకు అవకాశముంది.

మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. అన్ సీజన్లో థియేటర్లకు జనాల్ని ఏమేరకు రప్పిస్తుందన్నది చూడాలి. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కె.వి.గుహన్ రూపొందించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నివేథా థామస్, షాలిని పాండే నటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English