షారుక్.. పూజా హెగ్డే.. అల్లు శిరీష్ ప్ల‌స్ 497 మందికి నోటీసులు

షారుక్.. పూజా హెగ్డే.. అల్లు శిరీష్ ప్ల‌స్ 497 మందికి నోటీసులు

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు. ఆ మాట‌కు వ‌స్తే వంద‌ల సంఖ్య‌లో సెల‌బ్రిటీలు.. సినీ ప్ర‌ముఖులు.. ప‌లువురిని ప్ర‌భావితం చేసే స‌త్తా ఉన్న వారంద‌రికి సైబ‌రాబాద్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇలా నోటీసులు అందుకోనున్న వారిలో ప్ర‌ముఖ శ్రీ‌లంక మాజీ క్రికెట‌ర్  ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ .. బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు షారుక్ ఖాన్.. బొమ‌న్ ఇరానీ.. టాలీవుడ్ ప్ర‌ముఖులు పూజా హెగ్డే.. అల్లు శిరీష్ తో స‌హా ప‌లువురు ఉన్నారు.

క్యూనెట్ కంపెనీ సీఈవో.. డైరెక్ట‌ర్లు.. షేర్ హోల్డ‌ర్లు.. ప‌లువురు ప్ర‌ముఖులు మొత్తంగా 500 మందికి నోటీసులు పంపుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. తాము పంపిన నోటీసుల‌కు వారం వ్య‌వ‌ధిలో స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంద‌ని నోటీసుల్లో కోరిన‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. వీరంతా గ‌చ్చిబౌలిలోని సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ లో ఆర్థిక నేరాల విభాగం ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌న్న ఆదేశం ఉన్న‌ట్లుగా స‌మాచారం.

 మ‌ల్టీ లెవ‌ల్ మోసం క్యూనెట్ కు సంబంధించి పెద్ద ఎత్తున మోస‌పోయారు. ఇలా మోస‌పోయిన బాధితుడు ఒక‌రు ఇచ్చిన ఫిర్యాదుతో త‌వ్వ‌టం మొద‌లెట్టిన సైబ‌రాబాద్ పోలీసుల‌కు భారీ స‌మాచారం అందిన‌ట్లుగా తెలుస్తోంది. క్యూనెట్ కేసులో పోలీసుల‌ ద‌ర్యాప్తు విష‌యంలో సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఆర్డ‌ర్ ఇవ్వ‌లేద‌ని సైబ‌రాబాద్ పోలీసులు చెబుతున్నారు. క్యూనెట్ మోసం విలువ‌ దాదాపు రూ.10వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మొత్తం ద‌ర్యాఫ్తు పూర్తి అయితే కానీ ఎంత మోసం చేశార‌న్న దానిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ‌కున్న అంచ‌నా ప్ర‌కారం క్యూనెట్ బారిన దాదాపు మూడు ల‌క్ష‌ల మంది మోస‌పోయి ఉండొచ్చ‌న్న లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ కేసుకు సంబంధించి జ‌న‌వ‌రి తొలి వారంలో 14 కేసుల్లో 58 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా లో ఉన్న రూ.2.7కోట్ల మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. సైబ‌రాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసుల‌కు సెల‌బ్రిటీలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English