అన్న‌య్య బాట‌లో ప‌వ‌న్‌

జ‌న‌సేన పార్టీని స్థాపించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని ర‌కాలుగా ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డా.. ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం ఓట్లుగా మార‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా పార్టీని గెలిపించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప‌వ‌న్‌.. అందుకోసం ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకు త‌న అన్న‌య్య చిరంజీవి బాట‌లో సాగాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. బ‌స్సు యాత్ర‌ తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ప‌వ‌న్ అనుకుంటున్న‌ట్లు టాక్‌.

2009 ఎన్నిక‌ల్లో ఇటు రాష్ట్రంలో టీడీపీకి.. అటు కేంద్రంలో బీజేపీకి మ‌ద్ద‌తునిచ్చిన ప‌వ‌న్ పోటీ చేయ‌కుండా ఉండిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలో దిగి ఘోర‌మైన ప‌రాజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. తాను పోటి చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.

ఇప్పుడు బీజేపీతో జ‌న‌సేన పొత్తులో ఉంది. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆ పొత్తుతో త‌న పార్టీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆయ‌నే నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. ప‌వ‌న్‌కు ముఖ్య‌మంత్రి కావాల‌నే ఆశ ఉంది. అది వీలుకాక‌పోతే క‌నీసం ముఖ్య‌మంత్రిని నిర్ణ‌యించే అధికారాన్ని అయినా ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు. అందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు మెరుగైన ఫ‌లితాలు రావాలి.

ప‌వ‌న్‌కు జ‌నాల్లో క్రేజ్ ఉంది. ఇప్పుడా క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకునేందుకు ప‌వ‌న్ రంగంలోకి దిగ‌నున్నారు. ఏడాది పాటు జ‌నంలో ఉండేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్టేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన ప‌వ‌న్ అన్న‌య్య చిరంజీవి అప్పుడు బ‌స్సు యాత్ర చేస్తే మంచి స్పంద‌న వ‌చ్చింది. కాబ‌ట్టి ఇప్పుడు ప‌వ‌న్ కూడా అదే బాట‌లో సాగాల‌ని అనుకుంటున్నార‌ని స‌మాచారం. మొద‌ట్లో పాద‌యాత్ర‌నే చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ.. సెక్యూరిటీ ప‌రంగా ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని అభిమానుల కార‌ణంగా స‌మ‌స్య‌ల వ‌స్తే బాగుండ‌ద‌ని ప‌వ‌న్ అనుకుంటున్నారు. అందుకే బ‌స్సు యాత్ర చేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని భావిస్తున్నారు.

175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ బ‌స్సు యాత్ర ఉండేలా ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని ప‌వ‌న్ త‌న టీమ్‌ను ఆదేశించార‌ని స‌మాచారం. ప్ర‌తి నెల రెండు జిల్లాల చొప్పున ఈ యాత్ర కొన‌సాగేలా ప్లాన్ రూపొందించ‌నున్నార‌ని తెలుస్తోంది.