ఎన్టీఆర్‌పై మరీ ఇంత కోపమేంటి?

ఎన్టీఆర్‌పై మరీ ఇంత కోపమేంటి?

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’కు బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం దక్కిన నేపథ్యంలో దీని కొనసాగింపు చిత్రం ‘మహానాయకుడు’ మీద పెద్దగా ఆశలేమీ లేవు. ఇది తొలి భాగానికి భిన్నంగా పెద్ద హిట్టయిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. కాకపోతే ఓ మోస్తరుగా అయినా ఆడుతుందని ఆశించారు. కనీసం ఫుల్ రన్లో తొలి భాగం సాధించిన వసూళ్లు ఇది తెచ్చినా చాలనుకున్నారు.

 కానీ తొలి రోజు వసూళ్ల లెక్కలు చూస్తుంటే ఒక్కొక్కరికి దిమ్మదిరిగిపోతాయి. టాలీవుడ్లో పెద్ద హీరో, దర్శకుడు చేసిన సినిమాల్లో అతి పెద్ద డిజాస్టర్‌గా మిగిలిన ‘ఆఫీసర్’కు సమానంగా దీని వసూళ్లు ఉన్నాయి. తొలి రోజు మరీ ఇంత దారుణంగా వసూళ్లు ఉంటాయని ఎవ్వరూ అనుకోలేదు. ప్రేక్షకులు ‘యన్.టి.ఆర్’ సినిమా పట్ల ఇంత కఠినంగా ఉంటారని ఎవ్వరూ అనుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా విషయంలో జనాలకు కోపం ఉందేమో అనిపిస్తోంది వసూళ్ల వ్యవహారం చూస్తుంటే.

‘యన్.టి.ఆర్’ సినిమాను బాలయ్య, చంద్రబాబు తమకు అనుకూలంగా తీసుకోవడంపై ప్రేక్షకులు ఎంత అసహనం ఉందో ఈ సినిమా వసూళ్లు రుజువు చేస్తున్నాయి. తొలి భాగానికి అలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. చిత్ర బృందం ఏమీ మారకుండా అదే రీతిలో రెండో సినిమాను తయారు చేసి విడుదలకు సిద్ధం చేశారని ప్రేక్షకులకు అర్థమైంది. ట్రైలర్ చూశాక ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీంతో తొలి రోజు ఈ సినిమాను అస్సలు పట్టించుకోకుండా తమ ఆగ్రహాన్ని చూపించారు.

ఐతే నందమూరి కుటుంబ, తెలుగుదేశం వ్యతిరేకులు.. తటస్థంగా ఉండేవాళ్లు ఈ సినిమా చూడలేదంటే ఓకే అనుకుందాం. కానీ నందమూరి అభిమానులు, తెలుగుదేశం మద్దతుదారులు కూడా ఈ సినిమాను పట్టించుకోకుండా వదిలేస్తుండటమే ఆశ్చర్యం. ఈ వసూళ్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్లలో సగం మంది సినిమా చూసినా ఇది భారీ వసూళ్లు సాధించేది. కానీ ఆ పరిస్థితి లేదన్నది స్పష్టం. మరి టీడీపీ, నందమూరి మద్దతుదారులు కూడా ‘యన్.టి.ఆర్’ సినిమాపై ఇంత వ్యతిరేకత ఎందుకు ప్రదర్శిస్తున్నట్లో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English