గొడవలు జరిగాయని ఒప్పుకున్న క్రిష్

గొడవలు జరిగాయని ఒప్పుకున్న క్రిష్

చాలా తక్కువ సినిమాలతోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు క్రిష్. కానీ ఈ మద్య క్రిష్ పేరు రాంగ్ రీజన్స్‌తో వార్తల్లో ఉంటోంది. ‘మణికర్ణిక’ సినిమా విషయంలో క్రిష్ ఎంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడో తెలిసిందే. ఆ సినిమా విషయంలో మెజారిటీ జనాలు క్రిష్ వైపే నిలిచినా.. అతడి తీరు కూడా కొంత విమర్శల పాలైంది. మరోవైపు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ‘యన్.టి.ఆర్’ సినిమా ఫలితమూ తేడా కొట్టేసింది. సినిమా మేకింగ్ టైంలోనే క్రిష్‌కు ఈ చిత్ర బృందంలో కొందరితో గొడవలు నడిచినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసిన బాలయ్య బంధువు ప్రసాద్‌కు, క్రిష్‌కు తీవ్ర విభేదాలు తలెత్తినట్లుగా గుసగుసలు వినిపించాయి. ‘మహానాయకుడు’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా క్రిష్‌కు ఈ విషయమై ప్రశ్న ఎదురవగా.. ఆయనేమీ ఖండించలేదు.

‘యన్.టి.ఆర్’ సినిమా నిర్మాణ సమయంలో చిన్న చిన్న గొడవలు వచ్చిన వాస్తవమే అని క్రిష్ అంగీకరించాడు. ఐతే అవన్నీ చిన్న చిన్నవే అని.. అలాంటివి ఎక్కడైనా ఉంటాయని.. అవేవే సినిమాకు సంబంధించినవి కావని.. అలాగే సినిమాపై వాటి ప్రభావం కూడా ఏమీ లేదని క్రిష్ చెప్పాడు. మరి బాలయ్యతోనూ విభేదాలు వచ్చిన వార్తల గురించి అడిగితే మాత్రం అలాంటిదేమీ లేదన్నాడు క్రిష్. బాలయ్య తనకంటే సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని.. బాలయ్య అంతగా దర్శకులకు గౌరవం ఇచ్చే వ్యక్తి మరొకరు ఉండరని అన్నాడు. దర్శకుడు చెప్పిన మాటను బాలయ్య ఎప్పుడూ దాటడన్నాడు.

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమా బాగుందని అందరూ అన్నా ఆడకపోవడంపై క్రిష్ మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజైనపుడు అందరూ పాజిటివ్ కామెంట్లే చేశారని, ప్రశంసలు కురిపించారని.. అమేజాన్ ప్రైంలోకి వచ్చాక మరింతగా ప్రశంసలు అందాయని.. కానీ జనాలు థియేటర్లకు వెళ్లి ఎందుకు సినిమా చూడలేదో అర్థం కాలేదని.. ఇదే విషయం చాలామందిని తాను అడిగానని క్రిష్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English