అంత భారీ చిత్రం.. ఇంత చిన్న తెర మీదా?

మరక్కార్.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన భారీ చిత్రం. లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన ఈ చిత్రాన్ని మేకింగ్ దశ నుంచే మలయాళ ‘బాహుబలి’గా అభివర్ణిస్తున్నారు. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ స్టయిల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రియదర్శన్. దీని ప్రోమోలు చూస్తే సినిమా సంచలనం రేపడం ఖాయంగా కనిపించింది.

ఐతే ఏడాదిన్నర కిందటే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గత ఏడాది ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా చిత్ర బృందం టెంప్ట్ కాలేదు. ఇలాంటి భారీ చిత్రం వెండి తెరల్లో చూస్తేనే ప్రేక్షకులకు అందాల్సిన అనుభూతి అందుతుందన్న ఉద్దేశంతో సాధారణ పరిస్థితుల కోసం ఎదురు చూశారు.

ఐతే ఈ ఏడాది మార్చిలో థియేట్రికల్ రిలీజ్ కోసం సన్నాహాలు పూర్తి చేశాక కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఇక అప్పట్నుంచి మళ్లీ థియేటర్లు పూర్తి స్థాయిలో నడిచే వరకు ఎదురు చూసి చూసి.. ఎట్టకేలకు పరిస్థితులు బాగుపడుతున్నాయనుకుంటున్న సమయంలో ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేయడం లాల్ అభిమానులకు పెద్ద షాక్.

మలయాళంలో మళ్లీ థియేటర్లు పున:ప్రారంభమై.. కొన్ని రోజుల్లోనే 100 శాతం ఆక్యుపెన్సీ వస్తుందనుకుంటున్న సమయంలో ‘మరక్కార్’ను అమేజాన్ ప్రైమ్‌కు ఇచ్చేయడం అందరినీ నివ్వెర పరుస్తోంది. మంచి లాభానికే సినిమాను ప్రైమ్‌కు అమ్మేశారట. దేశంలో మిగతా రాష్ట్రాలన్నింట్లో కరోనా ప్రభావం బాగా తగ్గిన టైంలో కేరళలో వైరస్ ప్రభావం చూపింది.

ఇప్పుడు అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.. మళ్లీ వైరస్ ముప్పు ఉండొచ్చన్న సంకేతాల నేపథ్యంలో ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారన్న గ్యారెంటీ లేక, ఆశించిన రెవెన్యూ రాకపోవచ్చన్న భయంతో ఓటీటీ బాట పట్టినట్లున్నారు. కానీ ఇలాంటి సినిమాను బుల్లితెరల్లో చూడాల్సి రావడం మాత్రం లాల్ అభిమానులకే కాదు.. సాధారణ ప్రేక్షకులకు కూడా రుచించడం లేదు. త్వరలోనే ఈ భారీ చిత్రానికి రిలీజ్ డేట్ ఇవ్వనున్నారు.