మీటూపై ఎట్టకేలకు స్పందించాడు

మీటూపై ఎట్టకేలకు స్పందించాడు

‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా గత ఏడాది చాలామంది సినీ ప్రముఖులపై అమ్మాయిలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. నానా పటేకర్, వైరముత్తు లాంటి దిగ్గజాలు సైతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. చాలా సాఫ్ట్‌గా కనిపించే ప్రముఖ గాయకుడు కార్తీక్ సైతం ఆరోపణల్లో చిక్కుకున్నాడు. అతను తనను లైంగికంగా వేధించాడంటూ గతేడాది ఓ యువతి ఆరోపించింది. ఐతే తన ఐడెంటిటీని బయట పెట్టడానికి ఆ యువతి ఇష్టపడకపోవడంతో ఆమె తరఫున గాయని చిన్మయి పోరాడింది.

కార్తీక్ ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కానీ ఈ విషయంలో కార్తీక్ నోరు విప్పలేదు. తనపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి అతను ట్విట్టర్లో ఇన్ యాక్టివ్ అయిపోయాడు. బయటెక్కడా ఏ కార్యక్రమానికీ హాజరు కాలేదు. ఐతే ఎట్టకేలకు అతను తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించాడు. ట్విట్టర్లో ఒక లెంగ్తీ మెసేజ్ పెట్టాడు. తన తండ్రి అనారోగ్యం పాలవడం వల్లే తాను ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నట్లు అతను చెప్పాడు.

‘‘కొంతకాలం పాటు నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను. వేరే కారణాల వల్ల గత కొన్ని నెలలుగా నేను చాలా ఇబ్బందిపడుతున్నాను. నాపై ఎవరెవరో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఉద్దేశపూర్వకంగా నేను ఎవ్వరినీ కించపరచలేదు. ఒకవేళ నా వల్ల ఇబ్బంది కలిగి ఉంటే నేరుగా నన్నే వచ్చి కలవండి. మీటూ పేరుతో ఆరోపణలు చేస్తున్న వారి వైపు నిజం ఉంటే వారికి నా పూర్తి మద్దతునిస్తాను. ఒకవేళ నా తప్పు ఉంటే క్షమాపణ అడుగుతాను. ఈ విషయంలో చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. విషయం ఇంతదాకా వచ్చింది కాబట్టి మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అందుకే నేను సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నాను. పని మీద కూడా దృష్టిపెట్టలేకపోతున్నాను’’ అని కార్తీక్ పేర్కొన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English