జేడీ గాలి మళ్లీ పవన్ మీద మళ్లిందా?

నిజ‌మే! దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైపు.. సీబీఐ మాజీ జేడీ.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ చూపు మ‌ళ్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వ‌రకు ఐపీఎస్‌గా ఉన్న ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీ అధినేత జ‌గ‌న్ కేసుల విచార‌ణ బాధ్య‌త తీసుకున్న త‌ర్వాత‌.. ఆయ‌న పేరు ఒక్క‌సారిగా రాష్ట్ర వ్యాప్తం గా మార్మోగింది. అనంతర కాలంలో మ‌హారాష్ట్ర‌కు ఆయ‌న బ‌ద‌లీ కావ‌డం.. త‌ర్వాత‌.. అనూహ్యంగా.. ఉద్యోగా నికి రిజైన్ చేసి. వ‌చ్చి.. రాజ‌కీయాల్లో చేరారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన వైపు మొగ్గు చూపారు.

విశాఖ ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన టికెట్‌పై ఆయ‌న పోటీ చేశారు. ఈ క్ర‌మం లోనే అంద‌రికంటే భిన్నంగా జేడీ ఆలోచ‌న చేశారు. ప్ర‌జ‌ల‌కు కేవ‌లం హామీలు ఇవ్వ‌డ‌మే కాకుండా.. రూ. 100 రెవెన్యూ స్టాంపు పేప‌ర్‌పై త‌న హామీల‌ను చేర్చి.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌చారం చేశారు.. త‌ను క‌నుక హామీలు నెర‌వేర్చ‌క‌పోతే..ప్ర‌జ‌లు త‌న‌ను నిల‌దీయొచ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు తాను ఓడినా.. గెలిచినా.. సేవ చేస్తాన‌ని చెప్పారు. అయితే.. జ‌గ‌న్ సునామీతో ఆయ‌న ఓడిపోయారు. ఓట‌మి త‌ర్వాత కూడా.. కొన్ని రోజులు విశాఖ ప్ర‌జ‌ల‌కు చేరువ‌గానే ఉన్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.

అయితే.. అనూహ్యంగా.. ఆయ‌న జ‌న‌సేనకు దూర‌మ‌య్యారు. పార్టీ అధినేత ప‌వ‌న్‌.. సినిమాల్లోకి తిరిగి వెళ్లడాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. అనంత‌రం తాను కూడా జ‌న‌సేన కు రిజైన్ చేశారు. త‌ర్వాత‌..కొన్ని రోజులు రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశారు. కొత్త వ్య‌వ‌సాయ విధానాల‌పై వారికి శిక్ష‌ణ ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీ క‌రణ‌పై జేడీ యుద్ధ‌మే చేస్తున్నార‌ని చెప్పారు. అంద‌రూ రోడ్డెక్కి ఉద్య‌మం చేస్తే.. ఆయ‌న న్యాయ పోరాటం ద్వారా.. కేంద్రం మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌కు చెప్పించారు.

ఇక‌, అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని.. ముందుకు సాగుతున్నారు. విశాఖ‌లోనే ఉంటాన‌ని చెప్పినా.. అనివార్య కార‌ణాల‌తో ఆయ‌న దూరంగా ఉంటున్నారు. కానీ, త్వ‌ర‌లోనే ఆయ‌న విశాఖ‌లో సొంత ఇల్లు చూసుకునేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. ఇదిలావుంటే.. మ‌రోసారి జేడీ.. ప‌వ‌న్‌వైపు చూస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం ఏంటంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. విశాఖ ఉద్య‌మానికి మ‌ద్ద‌తిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 31న అక్క‌డ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు.

ఆదివారం గాజువాకలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ పాల్గొంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పోరాటానికి సీబీఐ మాజీ జేడీ సంఘీభావం తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలియజేస్తున్నందుకు సంతోషం. ఇది తమ నిర్ణయాన్ని మార్చుకునేలా భారత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఆశిస్తున్నాను’అంటూ పవన్ ట్వీట్ చేశారు.

జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి లక్ష్మీనారాయణ పవన్ చేస్తున్న పోరుకు సంఘీభావం తెలియజేయ‌డంతో ఆయన తిరిగి ప‌వ‌న్ వైపు చూస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ ప‌రిచ‌యం మ‌ళ్లీ .. ఆయ‌న తిరిగి జ‌న‌సేన‌లో పుంజుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుందేమో.. అని అంటున్నారు ప‌రిశీల‌కులు. చూడాలి. ఏం జ‌రుగుతుందో.