విజ‌య్‌పై అసూయా.. ఛాన్సే లేదన్న బ‌న్నీ

ఈ త‌రంలో స్వ‌శ‌క్తితో పెద్ద స్టార్‌గా ఎదిగిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి అంత త‌క్కువ స‌మ‌యంలో అంత పెద్ద స్టార్ అయిన హీరోలు చాలా అరుదుగా క‌నిపిస్తారు. తాను ఎన్నో ఏళ్లు క‌ష్ట‌ప‌డ్డాక ఖైదీ సినిమాతో కానీ స్టార్ స్టేట‌స్ సంపాదించలేద‌ని.. కానీ విజ‌య్ చాలా త‌క్కువ టైంలో పెద్ద స్టార్ అయిపోయాడ‌ని మెగాస్టార్ చిరంజీవి సైతం అన్నాడంటే విజ‌య్ ఎదుగుద‌ల ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు.

విజ‌య్‌ని చూసి వేరే హీరోలు అసూయ చెంది ఉంటే ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. నిజానికి టాలీవుడ్ టాప్ స్టార్ల‌లో ఒక‌డైన‌ అల్లు అర్జున్ ద‌గ్గ‌ర‌ ఎవ‌రో నేరుగానే ఈ విష‌యం ప్ర‌స్తావించార‌ట‌. విజ‌య్ అలా వేగంగా ఎదిగిపోతుంటే మీకు అసూయగా అనిపించ‌దా అని అడిగార‌ట. విజ‌య్ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కొత్త చిత్రం పుష్ప‌క విమానం ప్రి రిలీజ్ ఈవెంట్లో బ‌న్నీ ఈ విష‌యం ప్ర‌స్తావించాడు.

ఐతే ఆ ప్ర‌శ్న అడిగిన వ్య‌క్తితో.. తానెందుకు విజ‌య్‌ని అసూయ చెందుతాన‌ని ఎదురు ప్ర‌శ్నించిన‌ట్లు బ‌న్నీ వెల్ల‌డించాడు. సినిమాల‌నే కాదు.. ఏ రంగానికైనా వ‌ర్తించే విష‌యం ఒక‌టుంద‌ని.. ఎవ‌రైనా మ‌న‌ల్ని దాటి ముందుకు వెళ్లిపోతున్నారంటే మ‌నం వేగంగా ప‌రుగెత్త‌డం లేద‌ని అర్థ‌మ‌ని.. అప్పుడు త‌ప్పు మ‌న‌ద‌వుతుంది త‌ప్ప మ‌న‌ల్ని దాటి ముందుకు వెళ్తున్న వ్య‌క్తిది కాద‌ని.. కాబ‌ట్టి విజ‌య్‌ని చూసి తాను ఎప్ప‌డూ అసూయ చెంద‌లేద‌ని, చెంద‌బోన‌ని బ‌న్నీ స్ప‌ష్టం చేశాడు.

విజ‌య్ స్వ‌శ‌క్తితో ఎదిగిన న‌టుడ‌ని.. అత‌డంటే మొద‌ట్నుంచి త‌న‌కు చాలా చాలా ఇష్ట‌మ‌ని బ‌న్నీ చెప్పాడు. విజ‌య్ చాలా కొత్త‌గా ఆలోచిస్తాడ‌ని.. అదే స‌మ‌యంలో అత‌డిలో ఒక స్వీట్‌నెస్ ఉంటుంద‌ని.. సినిమాల వ‌ర‌కే కాకుండా బిజినెస్ ప‌రంగా కూడా రౌడీ బ్రాండు తీసుకొచ్చి దాన్ని విజ‌య్ ప్రమోట్ చేసిన తీరు త‌న‌నెంతో ఆక‌ట్టుకుంద‌ని బ‌న్నీ కొనియాడాడు.