నారా లోకేషూ.. అవసరమా ఇది?

నారా లోకేషూ.. అవసరమా ఇది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ ఎప్పుడూ ప్రతికూల కారణాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు. సోషల్ మీడియాలో లోకేష్ గురించి ఏ రేంజిలో ట్రోలింగ్ జరుగుతుంటుందో తెలిసిందే. అతనో ట్వీట్ వేశాడంటే వందల మంది అతడిని ట్రోల్ చేయడానికి రెడీ అయిపోతారు. అతను ట్వీట్లు వేసే విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. అన్ని విషయాల మీదా స్పందించేస్తే ప్రతికూలమయ్యే ప్రమాదం ఉంది. తాజాగా అలాంటిదే జరిగింది.

నిన్న సాయంత్రం ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో రెండో పార్ట్ మీద కూడా చాలా నెగెటివిటీ ఉంది. దాన్ని ఏమైనా తగ్గించేట్లు ట్రైలర్ ఉంటుందేమో అని ఆశిస్తే అలాంటిదేమీ జరగలేదు. ట్రైలర్ చాలా పేలవంగా కట్ చేశారు. ఇందులో ఎగ్జైట్ చేసే అంశాలే కనిపించలేదు.
ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తున్న సమయంలో లోకేష్ ఎంటరయ్యాడు. దీన్ని తెగ పొగిడేశాడు.

‘‘వెండి తెర ఇలవేల్పు, తెలుగువారి ఆరాధ్య నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ లో రెండవ భాగం ‘మహానాయకుడు’ చిత్ర ట్రైలర్ అత్యద్భుతంగా, ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహానాయకుడిగా బాలా మావయ్య నటన నభూతో నభవిష్యతి’’ అని ట్వీట్ చేశాడు లోకేష్. ఈ ట్వీట్ మీద జనాలు ఎలా స్పందించి ఉంటారో చెప్పేదేముంది? ‘యన్.టి.ఆర్’ సినిమాలో భజన మరీ ఎక్కువైపోవడమే ఈ సినిమా పరాజయానికి కారణమన్నది స్పష్టం. అసలు నిజాలు దాచేసి.. ఎగ్జాజరేషన్లతో నింపేశారన్నది ఈ సినిమా విషయంలో ఉన్న ప్రధాన విమర్శ.

అలాగే బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషించడం మీదా విమర్శలు వచ్చాయి. ‘మహానాయకుడు’ కూడా అందుకు భిన్నంగా లేదు. అందరూ ఈ ట్రైలర్‌ను తిట్టిపోస్తున్న తరుణంలోో లోకేష్ వచ్చి.. ట్రైలర్ అత్యద్భుతమని.. బాలయ్య నటన అదరహో అని అంటే జనాలకు ఎలా ఉంటుంది? నెటిజన్లకు మంటెత్తిపోయి లోకేష్‌ను గట్టిగా తగులుకున్నారు. ఎన్టీఆర్ గురించి పొగడ్డం చూసి అంత గొప్ప వ్యక్తిని మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచాడంటూ కొందరు ప్రశ్నిస్తే.. ఇంకొందరు ‘యన్.టి.ఆర్’ సినిమాను తీవ్రంగా విమర్శించారు. మొత్తానికి లోకేష్ ఈ ట్వీట్ వేసి అనవసరంగా విమర్శలు కొని తెచ్చుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English