విలన్ ఆయనైతే జనాలేం చూస్తారు?

విలన్ ఆయనైతే జనాలేం చూస్తారు?

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ డిజాస్టర్ అయ్యాక ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’పై ఎంత లో బజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి స్థితిలో ఈ సినిమా సక్సెస్ కావాలంటే అద్భుతాలు జరగాలి. మంచి బజ్ ఉండి, పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా  ‘కథానాయకుడు’ సినిమా పట్ల జనాలు ఆసక్తి ప్రదర్శించలేదు. ఇలాంటి స్థితిలో ‘మహానాయకుడు’ వైపు జనాల దృష్టి పడాలంటే దీని ట్రైలర్ ప్రత్యేకంగా.. ఎగ్జైటింగ్‌గా అనిపించాలి.

కానీ శనివారం సాయంత్రం రిలీజైన ట్రైలర్లో అలాంటి లక్షణాలేమీ కనిపించలేదు. ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తించే విషయాలు ఇందులో దాదాపుగా లేవనే చెప్పాలి. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ ప్లాప్ కావడానికి ప్రధాన కారణం ఆ కథ మరీ ఫ్లాట్‌గా సాగిపోవడం, పెద్దగా మలుపుల్లేకపోవడం, జనాలు ఎన్టీఆర్ జీవితం నుంచి తెలుసుకోవాలనే నిగూఢమైన విషయాలేమీ అందులో కనిపించలేదు.

కనీసం ‘మహానాయకుడు’లో అయినా అలాంటి విషయాలేమైనా చూపిస్తారేమో అని ఆశిస్తే అదేమీ లేదు. ముఖ్యంగా ఈ చిత్రంలో చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుంది.. ఆయన గురించి కొంచెమైనా ప్రతికూలంగా చూపిస్తారా.. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారం లాక్కున్న వైనాన్ని చూచాయిగా అయినా టచ్ చేస్తారా.. ఎన్టీఆర్ మరణాన్ని చూపిస్తారా అని జనాలు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ ఈ సినిమాలో అలాంటివేమీ ఉండవని ట్రైలర్లో స్పష్టం అయింది. ఎన్టీఆర్ నుంచి మొదటగా అధికారం లాక్కున్న నాదెండ్ల భాస్కరరావునే ఇందులో విలన్ని చేశారు.

ఆయన పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఐతే వాస్తవంగా చూస్తే ఎన్టీఆర్ జీవితంలో నాదెండ్ల కన్నా చంద్రబాబు పెద్ద విలన్. రెండోసారి ఎన్టీఆర్‌కు తగిలిన పోటే చాలా పెద్దది. తమకు ఇబ్బంది అనుకున్నపుడు రెండు ఉదంతాల్నీ విస్మరిస్తే ఓకే కానీ.. చంద్రబాబు ఎపిసోడ్‌ను పక్కన పెట్టి నాదెండ్ల వ్యవహారాన్ని ఇంత హైలైట్ చేస్తే.. ఆయన్ని పెద్ద విలన్ని చేస్తే జనాలకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో చెప్పేదేముంది? జనాలకు అన్ని నిజాలూ తెలిసినపుడు ఇలా సినిమా తీర్చిదిద్దితే ఇంకేం చూస్తారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English