వర్మనే దర్శకుడిని చేస్తే పోయేదే..

వర్మనే దర్శకుడిని చేస్తే పోయేదే..

తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథతో సినిమా తీయబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించగానే దీనికి దర్శకుడు ఎవరనే ఆసక్తి అందరిిలోనూ మొదలైంది. ఒక దశలో రామ్ గోపాల్ వర్మ పేరు గట్టిగా వినిపించింది. తాను ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లు వర్మ సంకేతాలు కూడా ఇచ్చాడు.

కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. వర్మ పేరు పక్కకు వెళ్లింది. తేజ లైన్లోకి వచ్చాడు. ఆ తర్వాత తేజను తప్పించి క్రిష్ చేతికి పగ్గాలిచ్చారు. ఐతే తనకు బయోపిక్ తీసే అవకాశం ఇవ్వకపోవడంతో వర్మకు మండి.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనౌన్స్ చేసినట్లుగా ఒక ప్రచారం ఉంది. ఐతే వర్మ ఇలా సినిమాలు ప్రకటించి.. మధ్యలో వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

బాలయ్య అండ్ కో వర్మతో ఏమైనా చర్చలు జరిపితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను కూడా వదిలేసేవాడేమో. కానీ అలాంటి ప్రయత్నాలు జరిగినట్లు లేదు. ఈ సినిమాను లైట్ తీసుకున్నారు.
తాము తీస్తున్న ‘యన్.టి.ఆర్’కు మాంచి క్రేజ్ రావడం.. మధ్యలో వర్మ బాగా అన్ పాపులర్ అయి ‘ఆఫీసర్’కు దారుణాతి దారుణమైన ఫలితం రావడంతో వర్మ గురించి పట్టించుకోనేలేదు బాలయ్య బృందం. కట్ చేస్తే.. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమా రిలీజై డిజాస్టర్ అయింది. మరోవైపు వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు క్రేజ్ వచ్చింది.

ఇప్పుడు ట్రైలర్ రిలీజవడంతో వర్మ సినిమాకు హైప్ మరింత పెరిగింది. ప్రస్తుత స్థితిలో అయితే ‘యన్.టి.ఆర్’ టీం పూర్తి డిఫెన్స్‌లో ఉంది. ‘కథానాయకుడు’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ‘మహానాయకుడు’ మీదా నమ్మకాలు లేవు. దీనికి తోడు వర్మ తన సినిమా ద్వారా తమను ఎంత డ్యామేజ్ చేస్తాడో అని నందమూరి, నారా కుటుంబాలు భయపడే పరిస్థితి ఉంది.

ట్రైలర్ చాలా బోల్డ్‌గా ఉండటంతో ఇది కచ్చితంగా బాలయ్య, బాబులకు ఇబ్బందికరం అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఆ ‘యన్.టి.ఆర్’ సినిమాను వర్మకే అప్పగించేసి ఉంటే ఈ తలనొప్పులేవీ ఉండేవి కావేమో అన్న అంతర్మథనం బాలయ్య టీంలో మొదలై ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English