క్రిష్ మాటను తప్పుబట్టిన కత్తి

క్రిష్ మాటను తప్పుబట్టిన కత్తి

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అంత దారుణమైన ఫలితం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ సినిమా అలా కావడానికి చాలామందికి కారణాలు అంతుబట్టలేదు. విడుదలకు ముందు మంచి బజ్, రిలీజ్ రోజు మంచి రివ్యూలు వచ్చిన సినిమా ఇలా అవుతుందని అనుకోలేదు. ఐతే క్రిటిక్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. ఫిలిం మేకింగ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుని.. ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్‌గా ఉంటూ.. అనేక వివాదాల్లో జోక్యం చేసుకుంటూ.. రాజకీయాలపైనా గట్టిగా మాట్లాడుతున్న మహేష్ కత్తి ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ అంత దారుణమైన ఫలితాన్ని అందుకోవడానికి కారణాలు విశ్లేషించాడు. ఈ సినిమా వైఫల్యంలో ప్రధాన పాత్ర బాలయ్యదే అని కత్తి తేల్చేశాడు. క్రిష్ తీరును కూడా ఆయన తప్పుబట్టాడు.

ఎన్టీఆర్ పాత్రను బాలయ్య చేయడమే ఈ సినిమాకు పెద్ద మైనస్ అని కత్తి అన్నాడు. బాలయ్య చేయడం వల్ల ఇది ఎన్టీఆర్ సినిమాలా కాకుండా బాలయ్య సినిమా అయిపోయిందని.. ఇక్కడే జనాలకు సగం ఆసక్తి చచ్చిపోయిందని కత్తి అన్నాడు. ఎన్టీఆర్ యుక్త వయసులో చాలా అందంగా ఉండేవాడని.. అలాంటి పాత్రను 58 ఏళ్లు పైబడ్డ బాలయ్య చేయడంతో ప్రథమార్ధం మొత్తాన్ని భరించడమే చాలా కష్టమైందన్నాడు. తెరపై బాలయ్యను అలా చూస్తుంటే తాను అయితే తట్టుకోలేకపోయానన్నాడు. ఎన్టీఆర్‌కు సంబంధించిన రకరకాల గెటప్పుల్లో బాలయ్య కనిపిస్తుంటే అదేదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా కనిపించిందన్నాడు. ఐతే వయసు పైబడ్డ ఎన్టీఆర్‌గా మాత్రం బాలయ్య బాగా కుదిరాడన్నాడు.

సావిత్రి జీవితంలో లాగా ఎన్టీఆర్ జీవితంలో డ్రామా లేకపోవడం, ఉన్న డ్రామాను కూడా పక్కన పెట్టేయడంతో ‘యన్.టి.ఆర్’ సినిమా ఫ్లాట్‌గా తయారైందని.. రచన, దర్శకత్వం రెండింట్లోనూ క్రిష్ విఫలమయ్యాడని కత్తి అభిప్రాయపడ్డాడు. ఎప్పుడైనా సరే.. సినిమా బాగుంటే, గొప్పగా ఉంటే జనాలు చూస్తారు కానీ.. ఎన్టీఆర్ గొప్ప వాడు కాబట్టి సినిమా ఆడుతుందనుకుంటే భ్రమే అన్నారు.

‘యన్.టి.ఆర్’ సినిమాను తెలుగుదేశం పార్టీ వాళ్లే చూడలేదని.. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసిన వాళ్లందరూ సినిమా చూసి ఉంటే ఇది బ్లాక్ బస్టర్ అయ్యేదని.. సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూస్తే టీడీపీ వాళ్లే చాలామంది సినిమా చూడలేదని స్పష్టమైందన్నాడు. ఈ సినిమా విడుదలకు ముందు క్రిష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు తెలుగు ప్రేక్షకులంతా ఒక టికెట్ బాకీ పడ్డారని అన్నారని.. ఆ మాట తప్పని.. ఎన్టీఆర్ కోసం తెలుగు ప్రేక్షకులు వందల టికెట్లు ఇచ్చారని.. అలా ఇస్తేనే ఎన్టీఆర్ అంతటి వాడయ్యాడని కత్తి అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English