ముఖేశ్ అంబానీ కుమార్తెకు అరుదైన గౌరవం

దేశీయంగా అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తాజాగా ఒక అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోనే ప్రతిష్ఠాత్మక స్మిత్ సోనియన్ ఆసియన్ ఆర్ట్ నేషనల్ మ్యూజియం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా తాజాగా నియమితులయ్యారు. దీని ప్రత్యేకత ఏమంటే.. ప్రపంచంలో అతి పెద్దదైన మ్యూజియంగా అభివర్ణిస్తారు.

విద్య.. పరిశోధనల సముదాయంగా ఉండే ఈ సంస్థలో ట్రస్టు సభ్యురాలిగా నాలుగేళ్లు వ్యవహరించనున్నారు. అంతేకాదు.. బోర్డు సభ్యుల్లో అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఆమె కావటం విశేషం. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఈ మ్యూజియం బోర్డులో మొత్తం 17 మంది సభ్యులు ఉంటారు. వీరిలో అమెరికా దేశ ప్రధాన న్యాయమూర్తి.. ఆ దేశ ఉపాధ్యక్షుడు.. ఆ దేశానికి చెందిన ముగ్గురుసెనేట్ సభ్యులు.. ఆ దేశ ప్రతినిధుల సభ్యకు చెందిన ముగ్గురు సభ్యులు.. తొమ్మిది మంది పౌరులు ఉంటారు. అలాంటి కొమ్ములు తిరిగిన పవర్ ఫుల్ సభ్యుల నడుమ ఈషా స్థానం దక్కించుకోవటం విశేషంగా చెప్పాలి.

స్మిత్ సోనియన్ మ్యూజియం పరిపాలనా బాధ్యతల్ని ఈ బోర్డు నిర్వహిస్తుంది. దీన్ని 1923లో ప్రారంభించారు. ఇందులో నియోలిథిక్ కాలం నుంచి నేటి కాలానికి చెందిన 45 వేలకు పైగా అరుదైన వస్తువులు.. కళాఖండాలు ఉంటాయి. ఇందులో చైనా.. జపాన్.. కొరియా.. దక్షిణాషియా.. ఆగ్రేయాషియాకు చెందినవి ఉన్నాయి. భారత్ తో పాటు ఆసియా కళలు.. కల్చర్ పట్ల మరింత అవగాహన పెంచటానికి.. అందరికి చేరువ కావటానికి ఇషా అంబానీ దార్శనికత.. బలమైన ఆకాంక్ష తాజా నియామకంతో తోడ్పడతాయని ట్రస్టు బోర్డు భావిస్తున్నట్లు చెబుతున్నారు.