పదేళ్లలో ఆ దర్శకుడి రాత మారిపోయింది

పదేళ్లలో ఆ దర్శకుడి రాత మారిపోయింది

బాలా.. తమిళంలో ఈ దర్శకుడిలా చాలా తక్కువ సమయంలో గొప్ప ఇమేజ్ సంపాదించిన వాళ్లు చాలా తక్కువమంది కనిపిస్తారు. కేవలం ఐదు సినిమాల అనుభవంతో అతను లెజెండరీ స్టేటస్ సంపాదించాడు. బాలా తొలి సినిమా ‘సేతు’ అప్పట్లో ఒక పెను సంచలనం. విక్రమ్‌ను ఒక్కసారిగా స్టార్‌ను చేసిన సినిమా ఇది. బాలాకు కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆపై ‘నందా’.. ‘పితామగన్’ లాంటి సినిమాలతో తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నాడు. విశాల్, ఆర్యలతో ‘అవన్ ఇవన్’ చేసే సమయానికి ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. తమిళ ప్రేక్షకులు, ఇండస్ట్రీ జనాలు ఆయన్ని దేవుడిలా చూడటం మొదలుపెట్టారు. మణిరత్నంతో సమానంగా గౌరవించారు. బాలాతో ఒక సినిమా చేయడం అదృష్టం అన్నట్లుగా చూశారు. ఆయన తర్వాతి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ బాలా ఆ అంచనాల్ని అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. గత పదేళ్లలో బాలా నుంచి వచ్చిన సినిమా ఏదీ ఆడలేదు. ఒకదాన్ని మించి ఒకటి ఘోరమైన ఫలితాన్నందుకున్నాయి. కొన్ని సినిమాలకు మంచి పేరొచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం దక్కలేదు. బాలా మరీ ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్లిపోయి మరీ పచ్చిగా సినిమాలు తీయడం చేటు చేసింది. చివరగా జ్యోతికను పెట్టి ‘నచ్చియార్’ అనే సినిమా తీస్తే అది కూడా సరిగా ఆడలేదు. ఇలాంటి సమయంలో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ఆయన చేతికి వచ్చింది. బాలా లాంటి దర్శకుడు రీమేక్ చేయడమేంటి.. అందులోనూ ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాను ఆయన డీల్ చేయగలడా అని అందరూ సందేహించారు. అనుకున్నదే అయింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసి జనాలు విస్తుబోయారు. ‘అర్జున్ రెడ్డి’లోని ఎసెన్స్ ఎంతమాత్రం అందులో కనిపించలేదు. చివరికి సినిమాపై విపరీతమైన నెగెటివిటీ రావడంతో బాలా వెర్షన్ మొత్తాన్ని స్క్రాప్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి దర్శకుడికి ఇంతకంటే అవమానం ఏముంటుంది. పాపం విక్రమ్‌తో ఉన్న స్నేహం దృష్ట్యా, అతడి కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏమీ మాట్లాడలేక సైలెంటైపోయాడు బాలా. మొత్తానికి దశాబ్దం కిందట లెజెండ్‌గా ఉన్న దర్శకుడు ఇప్పుడు ఈ స్థితికి చేరడం బాధాకరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English