వైఎస్ సినిమా.. వాళ్లకు పట్టలేదు

వైఎస్ సినిమా.. వాళ్లకు పట్టలేదు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని చూపిస్తూ యువ దర్శకుడు మహి.వి.రాఘవ్ తలపెట్టిన ‘యాత్ర’ సినిమాలో మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్ నటిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. మలయాళంలో ఆయన స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటివాడు తెలుగులో వచ్చి ఇలాంటి సినిమా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ సినిమాపై తటస్థ ప్రేక్షకులు కూడా కొంచెం ఆసక్తి ప్రదర్శించారంటే అందుక్కారణం మమ్ముట్టినే. ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా ఆయన కోసం సినిమా చూస్తున్న వాళ్లూ ఉన్నారు. మమ్ముట్టి ఎంత గొప్ప నటుడు అనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తెలుగులో ఈ చిత్రం అంచనాల్ని మించే స్పందన రాబట్టుకుంది. మంచి వసూళ్లతో సాగుతోంది. ఐతే ఈ చిత్రానికి మమ్ముట్టి సొంతగడ్డలో మాత్రం  తిరస్కారమే లభించింది.

‘యాత్ర’ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేశారు. ఐతే తమిళంలో అసలేమాత్రం ఈ సినిమాకు స్పందన కనిపించలేదు. నామమాత్రంగా రిలీజైంది. వసూళ్లు లేవు. దీని గురించి అక్కడ డిస్కషనే లేదు. ఇందులో కథ వారికి సంబంధం లేదు. ప్రధాన పాత్రధారి అక్కడి వాడు కాదు. దీంతో అక్కడ సినిమాను పట్టించుకోలేదు. ఐతే మమ్ముట్టి నటించాడు కాబట్టి మలయాళంలో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. తొలి వారాంతంలో కేరళలో ఈ చిత్రం కోటి రూపాయల్లోపే షేర్ రాబట్టింది. మమ్ముట్టి స్థాయికి ఇది చాలా తక్కువ మొత్తం. మామూలుగా ఆయన సినిమాలకు ఫస్ట్ వీకెండ్లో రూ.10 కోట్లకు తక్కువ కాకుండా షేర్ వస్తుంటుంది. ఎంత మమ్ముట్టి నటించినప్పటికీ.. వైఎస్ కథతో అక్కడి వాళ్లు కనెక్ట్ కాలేదన్నది స్పష్టం. ఇందులో డ్రామా తక్కువ. మలుపులు తక్కువ. మన జనాలకు వైఎస్‌తో ఉన్న అనుబంధం వల్ల ఇది మెప్పించింది కానీ.. మిగతా వాళ్లకు ఈ కథ రుచించడం లేదన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English