ఎన్టీఆర్ ఫ్రీ ఆఫర్లో ట్విస్టు?

ఎన్టీఆర్ ఫ్రీ ఆఫర్లో ట్విస్టు?

నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కించిన ‘యన్.టి.ఆర్’ సినిమా మీద బయ్యర్లు భారీ ఆశలే పెట్టుకున్నారు. నందమూరి బాలకృష్ణ మార్కెట్ స్థాయిని మించి ఈ సినిమాకు క్రేజీ ఆఫర్లు ఇచ్చారు. క్రిష్ చేతుల్లోకి సినిమా వెళ్లడం.. ప్రోమోలు ఆసక్తికరంగా ఉండటంతో భారీ రేట్లకు సినిమాను కొన్నారు. ‘యన్.టి.ఆర్’ ఒక్క భాగానికే బిజినెస్ రూ.70 కోట్లు దాటింది. సంక్రాంతి సీజన్లో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. పెట్టుబడి రికవరీ పెద్ద కష్టమేమీ కాదనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా సినిమాకు మంచి టాక్ వచ్చినా వసూళ్లు రాలేదు.

బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి దారుణమైన ఫలితం వచ్చింది. ఏకంగా రూ.50 కోట్ల నష్టాలతో తెలుగు సినీ చరిత్రలోనే అది పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. బయ్యర్ల పెట్టుబడిలో 30 శాతం మాత్రమే వెనక్కి వచ్చిన నేపథ్యంలో.. వారిని ఆదుకోవడం కోసం ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ను ఫ్రీగా ఇచ్చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి.

చిత్ర బృందం కూడా ఈ వార్తల్ని ఖరారు చేసినట్లే కనిపించింది. ఐతే ఈ సినిమాను ఫ్రీగా ఇచ్చినా కూడా బయ్యర్లు ఒడ్డున పడటం కష్టమే అన్నట్లుంది పరిస్థితి. ‘మహానాయకుడు’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తుందన్న అంచనాలేమీ లేవు. ఐతే ఓ మోస్తరుగా నష్టాన్ని కవర్ చేసుకోవడానికి అవకాశముంది. ఐతే ఈ ఫ్రీ ఆఫర్ రద్దయినట్లుగా ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘యన్.టి.ఆర్ కథనాయకుడు’ను కొన్న బయ్యర్లకు పెట్టుబడిలో 20 శాతం వెనక్కి ఇచ్చేసి.. ‘మహానాయకుడు’ను కొత్త బయ్యర్లకు ఇవ్వాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఐతే దీంతో పోలిస్తే ‘మహానాయకుడు’ను తమకు ఉచితంగా ఇస్తేనే ఎంతో కొంత నయం అంటున్నారు బయ్యర్లు. ఈ సినిమాను ఉచితంగా ఇచ్చాక కూడా ఎంతో కొంత నష్టం భర్తీ చేయాల్సిన అవసరం ఉండగా.. 70 శాతం నష్టపోయిన తమకు 20 శాతం వెనక్కి ఇచ్చి సినిమాను వేరే వాళ్లకు అమ్ముకోవడం ఏంటన్న ప్రశ్నలు బయ్యర్ల నుంచి వస్తున్నాయి. ఇదే జరిగితే పెద్ద గొడవ జరగడం ఖాయమంటున్నారు. తన తండ్రి మీద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా విషయంలో బాలయ్య అన్యాయం చేస్తే అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారట బయ్యర్లు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English