చైతూ.. ఈ క్రేజ్ ఏంటి సామీ!

చైతూ.. ఈ క్రేజ్ ఏంటి సామీ!

మిగతా రంగాలతో పోలిస్తే సినీ పరిశ్రమలో సక్సెస్‌కు చాలా విలువ ఎక్కువ. ఎంతటి వారైనా సరే.. విజయాల్లో లేకుంటే ఇక్కడి జనాలు పట్టించుకోరు. పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్లకు కూడా ఇది అనుభవమే. ఐతే అక్కినేని నాగచైతన్య మాత్రం జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. అతడి కోసం పెద్ద సంస్థలు లైన్లో నిలుస్తున్నాయి. రచయితలు, దర్శకులు ఆగకుండా చైతూ కోసం కథలు రెడీ చేస్తున్నారు.

‘ప్రేమమ్’.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో ఏడాదిన్నర కిందట చైతూ మంచి ఊపులోనే ఉన్నాడు కానీ.. ఆపై ‘యుద్ధం శరణం’.. ‘శైలజారెడ్డి అల్లుడు’.. ‘సవ్యసాచి’లతో హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొన్న చైతూకు డిమాండ్ తగ్గిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అతడి కోసం క్రేజీ ప్రాజెక్టులు రెడీ అవుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం ‘మజిలీ’ లాంటి ఆసక్తికర సినిమాలో నటిస్తున్న చైతూ దీని తర్వాత ‘వెంకీ మామ’ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కమిటైన సమయంలోనే విజయేంద్ర ప్రసాద్ తయారు చేసిన ఒక కథ చైతూ దగ్గరికి వచ్చింది. ఆ స్క్రిప్టు ఓకే చేసి దర్శకుడి కోసం చూస్తున్నారు. ఇంతలోనే ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఒక కథతో చైతూను కలిశాడు. దీనిపై డిస్కషన్లు నడుస్తున్నాడు. ఇప్పుడేమో ఇంకో క్రేజీ ప్రాజెక్టులో చైతూ పేరు వినిపిస్తోంది.

అగ్ర నిర్మాణ సంస్థ ‘యువి క్రియేషన్స్’.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చైతూ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తోందట. ఈ సినిమా గురించి ఇంతకుముందే వార్తలొచ్చాయి కానీ.. మధ్యలో బ్రేక్ పడిందన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’.. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలతో సత్తా చాటిన గాంధీ.. ‘కృష్ణార్జున యుద్ధం’తో ఎదురు దెబ్బ తిన్నాడు. చైతూ కోసం అతను మంచి సబ్జెక్టు రెడీ చేయడంతో యువి వాళ్లు దీన్ని పట్టాలెక్కించడానికి ముందుకొచ్చారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English