లోకేష్ ఎదుగుద‌ల‌కు అడ్డంకి ఎవ‌రు?

టీడీపీలో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్‌.. ఎందుకు ఎద‌గ‌లేక పోతున్నారు? సాహ‌సించి ఏ కార్య‌క్ర‌మాన్నీ ఎందుకు చేయ‌లేక పోతున్నారు? తెర‌వెనుక ఏం జ‌రుగుతోంది? అనే అంశాల‌పై పెద్ద ఎత్తున త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో అస‌లు ఏం జ‌ర‌గాలి..? లోకేష్ గురించి పార్టీలో పెద్ద‌లు ఇస్తున్న స‌ల‌హాలు ఏంటి? ఆయ‌న ఎందుకు వెనుక‌డుగు వేస్తున్నారు? అనే అంశాలు ఆస‌క్తిగా మారాయి.

టీడీపీలో ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1గా చంద్ర‌బాబు ఉన్నారు. ఈయ‌న త‌ర్వాత ఎవ‌రు? అనే ప్రశ్న వ‌స్తే.. లోకేష్ అనే మాటే వినిపిస్తోంది. మ‌రి ఎందుకు ఆయ‌న‌.. పుంజుకోవడం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న తొలిసారి పోటీ చేసి ఓడిపోవ‌డం.. మ‌రింత మైన‌స్ అయింది. మ‌రి ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పుంజుకోవడం.. స‌హా.. పార్టీని కూడా అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్య‌త ఉంద‌ని.. పార్టీలో కొంద‌రు అంటుంటే .. నిజ‌మ‌నేవారు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని ఎక్కువ మంది సూచిస్తున్నారు. ఇదే ఇప్పుడు.. ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది.

ప్ర‌జ‌ల్లో ఉండాలంటే.. పాద‌యాత్ర చేయ‌డ‌మేనా? గ‌త ఎన్నిక‌ల‌కు రెండున్న‌రేళ్ల‌కు ముందుగానే జ‌గ‌న్‌.. పాద‌యాత్రకు రెడీ అయిపోయారు. మ‌రి ఇప్పుడు టీడీపీ కూడా పాద‌యాత్ర చేయాల‌నేది ప్ర‌ధానంగా డిమాండ్ వినిపిస్తోంది. అది కూడా.. లోకేషే చేయాల‌నే సూచ‌న‌లు, స‌ల‌హాలు వ‌స్తున్నాయి. దీనివ‌ల్ల‌.. పార్టీ పుంజుకోవ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు లోకేష్ బాగా క‌నెక్ట్ అవుతాడ‌ని.. అంటున్నారు. ఇది నిజ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో పాద‌యాత్ర చేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. ఆయ‌న త‌న‌యుడు.. జ‌గ‌న్‌లు అధికారంలోకి వ‌చ్చేశారు. సో.. ఇప్పుడు లోకేష్‌కు దీనిని మించిన మంత్రం లేద‌ని అంటున్నారు.

అయితే.. దీనిపై లోకేష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక పోతున్నార‌నేది సీనియ‌ర్ల వాద‌న‌. దీనికి కార‌ణం.. ఏంటి? ఆయ‌న ఎదుగుద‌ల‌కు కీల‌క‌మైన ఈ పాద‌యాత్ర‌పై ఎందుకు జంకుతున్నారు? అనే దానికి మూడు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న పార్టీ.. ఇప్పుడు కొత్త‌గా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వ‌చ్చిందా? అనేది స‌మ‌స్య‌. రెండు.. ఇంత భారీ ప్లాన్‌ను పూర్తిచేయ‌గ‌ల‌రా? అనేది .. మ‌రో మూడో ప్ర‌ధాన కార‌ణం.. లోకేష్‌.. పాద‌యాత్ర‌కు దిగితే.. చంద్ర‌బాబు ఇమేజ్ పార్టీపై త‌గ్గిపోతుందా? అనేది చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఇమేజ్ పార్టీని కాపాడుతోంది. సో.. ఇప్పుడు అది కూడా పోతే.. ఎలా? అనేది స‌మ‌స్య‌. ఈ కార‌ణాలే.. లోకేష్‌ను వెనుకంజ వేయిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.