వివేకా మృతికి ఆ నలుగురే కారణమంటోన్న సీబీఐ

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే ఈ కేసులలో అనుమానితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన సీబీఐ అధికారులు….తాజాగా మరో కీలక అడుగు వేశారు. వివేకా మర్డర్ కేసులో తాజాగా పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

ఈ కేసులో గంగిరెడ్డి, సునీల్‌ యాదశ్, ఉమా శంకర్‌రెడ్డి, దస్తగిరిలపై సీబీఐ అభియోగాలు మోపుతూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివేకా మృతికి ఆ నలుగురు కారణమని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో నిందితులను ఆగస్టు, సెప్టెంబర్‌లో అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించామని ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది.

ఈ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని కూడా ఛార్జిషీట్ లో పొందుపరిచింది. నిందితుల్లో ఇద్దరు ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, మరో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది.

4 నెలలుగా ఈ కేసు విచారణ సాగుతోందని, ఈ విచారణలో సేకరించిన కీలక పత్రాలతో కూడిన నాలుగైదు బండిల్స్‌ను చార్జిషీట్‌లోని అంశాలకు ఆధారాలుగా సీబీఐ సమర్పించింది. వాస్తవానికి ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు మంగళవారమే పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు వచ్చారు. కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలవులో ఉండడంతో దాఖలు చేయలేదు. తాజాగా నేడు కోర్టుకు వచ్చిన సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు, సీబీఐ ఛార్జిషీట్‌ కాపీని తనకు ఇప్పించాలని కోర్టుకు వివేకా కుమార్తె వైఎస్ సునీత విజ్ఞప్తి చేశారు.