ధోని ముందా నీ కుప్పిగంతులు?

ధోని ముందా నీ కుప్పిగంతులు?

మైదానంలో మహేంద్ర సింగ్ ధోని చురుకుదనం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 38వ పడికి చేరువ అవుతూ కూడా అతను వికెట్ల వెనుక ఎంత షార్ప్‌గా ఉంటున్నాడో.. ఎలా మెరుపు స్టంపింగ్‌లు, రనౌట్లు చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. అతడి వేగానికి ముగ్ధులవ్వని వాళ్లు లేరు. ఐసీసీ అధికారిక వెబ్ సైట్లో ధోని మెరుపులకు సంబంధించిన వీడియోలు, ఆసక్తికర కామెంట్లు కనిపిస్తుంటాయి. ఐతే స్టంపింగ్ చేయడంలోనే కాదు.. తప్పించుకోవడంలోనూ ధోని మొనగాడే అని తాజాగా రుజువైంది.

న్యూజిలాండ్‌తో భారత జట్టు ప్రస్తుతం మూడు టీ20ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం రెండో టీ20లో ధోని బ్యాటింగ్ చేస్తుండగా.. ప్రత్యర్థి జట్టు స్పిన్నర్ ఇష్ సోధి తెలివైన ఎత్తుగడ వేశాడు. ధోని కొంచెం ముందుకొచ్చి షాట్లు ఆడే ప్రయత్నం చేస్తుండటంతో బంతిని కొంచెం వికెట్లకు దూరంగా వేశాడు. ధోని కచ్చితంగా ముందుకు వస్తాడని గ్రహించి సోధి అలా బంతి వేశాడు. బంతి అందుకోవడంలో ధోని విఫలమైతే స్టంపౌట్ చేయొచ్చన్నది అతడి వ్యూహం. కానీ ఇక్కడే ధోని తన మార్కు చూపించాడు.

క్రీజు వదిలి ముందుకు వచ్చాడు కానీ.. షాట్ ఆడే అవకాశం లేదని గ్రహించి వ్యూహం మార్చాడు. కొంచెం ఆగి బంతిని ఆపుకున్నాడు. అంతటితో ఆగిపోతే ధోని ప్రత్యేకత ఏముంటుంది. బంతి ఎంతో దూరం వెళ్లకపోయినా.. శరవేగంగా పరుగెత్తి రన్ పూర్తి చేశాడు. అవతలి ఎండ్‌లో ఉన్న పంత్ కూడా వేగంగానే స్పందించడంతో పరుగు పూర్తయింది. రన్ వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోని ముందా నీ కుప్పిగంతులు అంటూ సోధి మీద సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఐసీసీ సైతం ధోని చురుకుదనానికి మెచ్చి ఈ వీడియోను అధికారిక వెబ్ సైట్లో షేర్ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English