వైఎస్ నిజంగా అంత మొగోడా?

వైఎస్ నిజంగా అంత మొగోడా?

బయోపిక్ అంటే చాలు.. ఎంచుకున్న కథలో ప్రధాన పాత్రను గొప్పగా చూపించడం అలవాటైపోయింది ఫిలిం మేకర్స్‌కు. ప్రతికూల విషయాలన్నీ దాచేయడం.. సానుకూల విషయాల్ని పెద్దవి చేసి చూపించడం.. ఇదీ వరస. మొన్న ‘యన్.టి.ఆర్’లో.. ఇప్పుడు ‘యాత్ర’లో జరిగింది ఇదే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గొప్ప పౌరుషం ఉన్న వ్యక్తిగా, ఎవ్వరికీ తల వంచని మొనగాడిగా చూపించారు ‘యాత్ర’లో.

ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్‌ పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకున్న మాట వాస్తవమే కానీ.. 2004 ఎన్నికలకు ముందే ఆయన ఆడింది ఆట అన్నట్లు నడిచినట్లుగా సినిమాలో ప్రొజెక్ట్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన అసలేమాత్రం లెక్క చేయలేదు.. వాళ్లకు ఈయన టెర్మ్స్ డిక్టేట్ చేశాడు అని సినిమాలో చూపించారు. కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు.

2004 ఎన్నికలకు ముందు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి విధేయుడిగానే ఉన్నారు. అధిష్టానం మాట ఎంతమాత్రం ఆయన వినలేదు.. తన మాటే నెగ్గేలా చేసుకున్నాడు అన్నది పూర్తి అబద్ధం. కొన్ని సీట్ల ఎంపికలో వైఎస్ మార్కు ఉన్న మాట వాస్తవమే. ఆయన చెప్పిన వాళ్లకు సీట్లు ఇచ్చిన మాటా వాస్తవమే. అయితే మొత్తంగా అధిష్టానం పంపిన జాబితాను ఈయన బుట్టదాఖలు చేసి.. తనకు నచ్చిన వాళ్లకే సీట్లు ఇచ్చారన్నది అబద్ధం.

అలాగే వివిధ సందర్భాల్లో అధిష్టానం పెద్దలతో కయ్యం పెట్టుకుని.. వాళ్లపై తన పంతం నెగ్గేలా చేశారన్నదీ అబద్ధం. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ పట్టు చూసి అధిష్టానం కొంచెం వెనక్కి తగ్గడం.. వైఎస్ వ్యక్తిగత ఇమేజ్ పెరగడం నిజమే కానీ.. అప్పుడు కూడా ఇరు వర్గాలూ సర్దుబాటు ధోరణితోనే వెళ్లాయి తప్ప.. సినిమాలో చూపించినట్లుగా అధిష్టానాన్ని వైఎస్ ధిక్కరించడం ఎప్పుడూ జరగలేదు. ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ నాయకుడిగానే ఉన్నాడు. కాంగ్రెస్ నాయకుడిగానే ఎదిగాడు. కాంగ్రెస్ నాయకుడిగానే మరణించాడు. కానీ సినిమాలో మాత్రం దీనికి భిన్నంగా చూపించారు. వైఎస్ త‌ల‌కు అస‌లు కాంగ్రెస్ కండువా కూడా క‌ట్ట‌కుండా వేరేదో రంగుతో త‌ల‌పాగా చుట్ట‌డం విడ్డూరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English