ఇవి దండగమారి బయోపిక్స్

ఇవి దండగమారి బయోపిక్స్

బయోపిక్.. అంటే నిజ జీవిత వ్యక్తి కథతో తెరకెక్కే సినిమా. కానీ వీటిలో ‘నిజాలు’ ఎంత వరకు ఉంటున్నాయి అన్నదే సందేహంగా మారుతోంది. ఎవరి మీదైతే సినిమా తీస్తున్నారో ఆ వ్యక్తిని ఒక మహాత్ముడిలా చూపించడానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. వాళ్లలో అసలు లోపాలే లేవన్నట్లుగా.. వాళ్లు చేసిన ప్రతి పనీ మంచిదే అన్నట్లుగా.. వాళ్ల జీవితంలో ప్రతికూల కోణాలే లేవన్నట్లుగా తెర మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు.

 దీంతో జనాలు ఒక రకమైన అనుమానంతో, అసహనంతో సినిమాలు చూడాల్సి వస్తోంది. బాలీవుడ్లో కొన్ని స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి. వాటిలో కొన్ని వాస్తవానికి కాస్త దగ్గరగా అనిపించాయి. ఆయా వ్యక్తుల జీవితంలోనే మంచి డ్రామా ఉండటం వల్ల కూడా ఆ కథలు పండాయి. ‘బాగ్ మిల్కా బాగ్’ అందుకు ఒక ఉదాహరణ. ఐతే ఈ సినిమా బాగా ఆడటంతో ఇక వరుసబెట్టి స్పోర్ట్స్ బయోపిక్స్ తీశారు.

వాటిలో ప్రతి క్రీడాకారుడినీ శిఖరం మీద నిలబెట్టేశారు. దీంతో మిగతా బయోపిక్స్‌లో ప్రేక్షకాదరణ పొందినవి తక్కువే. తర్వాతి సినిమాల్లో ఒక్క ‘యం.ఎస్.ధోని’ మాత్రమే ఆడింది. అందులో ఎగ్జాజరేషన్లు లేకపోవడం ప్లస్ అయింది. మిగతావన్నీ ‘అతి’ కేటగిరిలోనివే.

స్పోర్ట్స్ బయోపిక్స్ పక్కన పెడితే.. ఇప్పుడు సినిమా వాళ్ల మీద, రాజకీయ నేతల మీద సినిమాలు తీసేస్తున్నారు. తెలుగులో ఈ ఒరవడి బాగా కనిపిస్తోంది. ‘మహానటి’లో సావిత్రి జీవితాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించారు. ఆమెలోని ప్రతికూల కోణాల్ని కూడా ఎలివేట్ చేశారు. దీంతో ప్రేక్షకులకు ఆ సినిమా విశేషంగా నచ్చింది. అసలు లోపాలు లేని, తప్పులు చేయని మనిషి ఉంటాడా? మరి ప్రతికూల కోణాల్ని చూపించకుండా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసేదెలా? ఈ సంగతి పక్కన పెట్టేసి ఫ్లాట్‌గా సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. ఆహా ఓహో అంటూ భజన సినిమాలు తీస్తున్నారు.

‘యన్.టి.ఆర్’.. ‘యాత్ర’ ఆ కోవలోని సినిమాలే. ఎన్టీఆర్, వైఎస్ ఇద్దరినీ ఇందులో మహాత్ములుగానే చూపించారు. ఒక చిన్న లోపం చూపించలేదు. దీంతో ఈ సినిమాలు ఫ్లాట్‌గా అనిపిస్తున్నాయి జనాలకు. ‘యన్.టి.ఆర్’ సినిమా డిజాస్టర్ కాగా.. ‘యాత్ర’ కూడా అందరి ఆమోదం పొందట్లేదు. దర్శకుడు మహి.వి.రాఘవ్ సినిమా తీయడం బాగానే తీశాడు కానీ.. వైఎస్‌లోని వేరే కోణాలు వేటినీ ఎలివేట్ చేయలేదు. దీని బడ్జెట్ తక్కువ కాబట్టి ‘యన్.టి.ఆర్’ లాగా డిజాస్టర్ కాకపోవచ్చేమో కానీ.. అందరినీ మెప్పించడమైతే కష్టమే. ఇలా ఏకపక్షంగా సినిమాలు తీయడమైతే వృథా. ఇవి దండగమారి బయోపిక్సే అవుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English