వైఎస్‌పై సినిమా.. వద్దే వద్దన్న నిర్మాత

వైఎస్‌పై సినిమా.. వద్దే వద్దన్న నిర్మాత

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద సినిమా అనగానే.. ఆయన గురించి కొత్తగా చెప్పే విషయాలేముంటాయి.. అయినా ఈ తరం రాజకీయ నాయకుల మీద సినిమాలేంటి అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైఎస్‌ను అభిమానించే వాళ్లు ఎంతమంది ఉన్నారో.. ద్వేషించే వాళ్లూ అదే స్థాయిలో ఉన్నారు. వైఎస్ గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసిన మాట వాస్తవం. అదే సమయంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే అత్యంత అవినీతి పరుడు అనే ఆరోపణలున్నాయి.

ఇలాంటి వ్యక్తి మీద సినిమా తీస్తే జనాల్లో ఏమాత్రం ఆదరణ ఉంటుందన్న సందేహాలు కలిగాయి. అందులోనూ నందమూరి తారక రామారావు మీద తీసిన ‘యన్.టి.ఆర్’ సినిమాకే ఆదరణ దక్కని నేపథ్యంలో వైఎస్ సినిమాపై ప్రతికూలత మరింత పెరిగింది. ఐతే ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఉన్నంతలో మంచి టాకే తెచ్చుకుంది. ప్రేక్షకాదరణ కూడా బాగానే ఉంది. ఐతే సినిమా మొదలైనపుడు.. ఆ తర్వాత జనాలకు కలిగిన సందేహాలే చిత్ర నిర్మాత విజయ్‌కు కూడా కలిగాయట.

‘యాత్ర’ దర్శకుడు మహి.వి.రాఘవ్.. ఈ చిత్రాన్ని నిర్మించిన ’70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లోనే ‘ఆనందో బ్రహ్మ’ సినిమా చేశాడు. ఆ సినిమా విడుదల కావడానికి ముందే మహి.. వైఎస్ మీద సినిమా చేసే ఆలోచనను నిర్మాతల్లో ఒకడైన విజయ్‌తో పంచుకున్నాడట. ఐతే ఆ ఆలోచన చెప్పగానే విజయ్ గట్టిగా వ్యతిరేకించాడట. వివాదాలతో ముడిపడ్డ ఇలాంటి సినిమా మనకెందుకు.. వేరే జానర్లో ఏదైనా డిఫరెంట్ స్టోరీ చెప్పు అన్నాడట.

ఐతే మహి.. సినిమాలో ఒకే ఒక్క సీన్ చెబుతా వినమంటూ.. మార్కెట్ యార్డులో రైతు ఆత్మహత్యాయత్నం చేయడం, ఆ తర్వాత అతడికి వైఎస్ ‘నే విన్నాను నేనున్నాను’ అని డైలాగ్ చెప్పడం గురించి వివరించాడట. ఈ సీన్ విని విజయ్ కదిలిపోయాడట. ఇలాంటి ఎమోషనే సినిమా అంతా ఉండేట్లయితే.. వివాదాల జోలికి వెళ్లనట్లయితే సినిమా నిర్మించడానికి సిద్ధం అన్నాడట. 15 రోజుల తర్వాత మహి స్క్రిప్టు ఫుల్ నరేషన్ ఇచ్చాక ధీమాగా సినిమా నిర్మించడానికి ముందుకొచ్చినట్లు విజయ్ వివరించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English