ఆమిర్ ఖాన్.. ప్రేక్షకులపై ప్రేమతో

ఆమిర్ ఖాన్.. ప్రేక్షకులపై ప్రేమతో

సినిమా అంటే అమీర్ ఖాన్‌కు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో ఉండే ప్రతి ఒక్కరికీ సినిమా అంటే ప్రేమే కదా అనుకోవచ్చు. కానీ ఆమిర్ ఖాన్ సినిమాలు చూస్తే.. ఆయన తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతి ఇవ్వాలని ఎంతగా తపిస్తాడో అర్థమవుతుంది.

ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి ఆమిర్ ఖాన్ ప్రయాణం చాలా గొప్పగా సాగుతోంది. మధ్యలో ‘మంగల్ పాండే’.. ఈ మధ్య ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లాంటి సినిమాలు నిరాశ పరిచి ఉండొచ్చు కానీ.. అవి మినహా అన్నీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించినవే. తన స్వీయ దర్శకత్వంలో తీసిన ‘తారే జమీన్ పర్’.. తన నిర్మాణంలో వచ్చిన ‘పీప్లి లైవ్’.. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ లాంటి సినిమాలు ఆమిర్ అభిరుచికి, ఆయన సామాజిక స్పృహకి అద్దం పడతాయి. ఇప్పుడు ఆమిర్ ప్రొడక్షన్లో ‘రుబారు రోషిణి’ అనే సినిమా రాబోతోంది.

ఈ సినిమా విషయంలో ఆమిర్ గొప్ప సాహసమే చేయబోతున్నాడు. సమాజంపై ఎంతో ప్రభావం చూపించే అవకాశమున్న ఈ సినిమాను ఉచితంగా అందరూ చూసే అవకాశం కల్పించబోతున్నాడు. స్వాతి భత్కల్ చక్రవర్తి భక్తల్ అనే కొత్త దర్శకురాలు రూపొందించిన సినిమా ఇది. ఈ కథ విన్నాక ఎంతో ఉద్వేగం కలిగిందని.. సినిమా పూర్తయి చూసుకున్నాక వ్యక్తిగతంగా తాను ఎంతో మారానని.. వేరే వాళ్లకు చూపించినా వాళ్లకూ అదే భావన కలిగిందని ఆమిర్ చెప్పాడు.

ఇలాంటి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే అందరూ టికెట్లు కొనుక్కుని చూసే అవకాశం ఉండకపోవచ్చని.. ఐతే అందరూ ఈ సినిమా చూడాలన్న ఉద్దేశంతో దీన్ని థియేటర్లలో కాకుండా నేరుగా టీవీల్లో రిలీజ్ చేస్తున్నానని ఆమిర్ ప్రకటించాడు. అంటే పెట్టిన పెట్టుబడిని శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా మాత్రమే రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆమిర్. నేరుగా టీవీలో ప్రసారం అయితే ప్రేక్షకులందరూ ఉచితంగా సినిమా చూస్తారని.. ఎక్కువమందికి రీచ్ అవుతుందని అంటున్నాడు ఆమిర్. ఇది ప్రేక్షకులపై ప్రేమతో ఆమిర్ చేస్తున్న ప్రయత్నం. మరి ఆమిర్ చెబుతున్నట్లు అంతగా ఈ సినిమాలో ఏముందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English