మమ్ముట్టి మామూలోడు కాదబ్బా

మమ్ముట్టి మామూలోడు కాదబ్బా

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానం.. 350 సినిమాలు.. మూడు జాతీయ అవార్డులు.. ఐదు కేరళ ప్రభుత్వ పురస్కారాలు.. 13 ఫిలిం ఫేర్ అవార్డులు.. ఇంకా మరెన్నో ఘనతలు.. ఇదీ మమ్ముట్టి సినీ కెరీర్ తాలూకు కొన్ని ముచ్చట్లు. మలయాళంలోనే కాదు.. వేరే భాషల్లోనూ ఆయన ప్రతిభ ఏంటో చూశారందరూ. ‘దళపతి’తో తమిళ ప్రేక్షకుల్ని.. ‘స్వాతి కిరణం’తో తెలుగు ఆడియన్స్‌ను మంత్ర ముగ్ధుల్ని చేశారాయన.

‘స్వాతి కిరణం’తో ఎనలేని పేరు సంపాదించిన ఆయన.. ఆ తర్వాత తెలుగు తెర వైపు చూడనే లేదు. మధ్యలో అవకాశాలు వచ్చినా.. ఆ పాత్రలేవీ ఆయన్ని ఇన్‌స్పైర్ చేయకపోవడంతో ఒప్పుకోలేదు. అలాంటి వాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీసిన ‘యాత్ర’ను ఒప్పకోవడం అందరికీ పెద్ద షాకే.

వేరే రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడి మీద తీసే సినిమా.. అది కూడా రెండు సినిమాల అనుభవమున్న దర్శకుడు చేస్తున్నాడు.. బడ్జెట్ కూడా తక్కువ.. ఇలాంటి ప్రాజెక్టులో మమ్ముట్టి భాగం అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆయన స్థాయికి తగిన సినిమా ఇది కాదన్నారు చాలామంది. కానీ ఈ రోజు ‘యాత్ర’ సినిమా చూసిన వాళ్లందరూ శభాష్ మమ్ముట్టి అంటున్నారు.

వైఎస్ అభిమానులకు ఎలాగూ ఈ సినిమా సూపర్ అనిపిస్తుంది. ఉద్వేగం కలిగిస్తుంది. కానీ తటస్థ ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి, మెచ్చడానికి ఏకైక కారణం మమ్ముట్టినే. ఆయన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారనడంలో సందేహం లేదు. మామూలుగా బయోపిక్ అనగానే.. నటుడు తాను ఎవరి పాత్ర చేస్తున్నాడో ఆ వ్యక్తిని అనుకరించడానికే ప్రయత్నిస్తాడు. ఐతే మమ్ముట్టి మాత్రం అంతకుమించి వైఎస్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ పరంగా కొంత వరక వైఎస్‌ను గుర్తుకు తెస్తూనే.. ఆ పాత్ర తాలూకు డెప్త్‌ను, ఇంటెన్సిటీని అర్థం చేసుకుని.. దాన్ని తెరమీదికి తీసుకొచ్చిన వైనం మమ్ముట్టి గొప్పదనాన్ని తెలియజేస్తుంది.

సగటు ప్రేక్షకుల్ని సినిమాలో సీరియస్‌గా ఇన్వాల్వ్ చేయిస్తున్నది మమ్ముట్టినే. గొప్ప నటులు ఊరికే ఒక స్థాయికి వచ్చేయరు అనడానికి ఇదొక ఉదాహరణ. ఒక పరభాషా నటుడు వచ్చి వైఎస్‌గా నటించి మెప్పించడం, ప్రేక్షకుల్ని ఒప్పించడం చిన్న విషయం కాదు. ఈ విషయంలో మమ్ముట్టిని ఎంత పొగిడినా తక్కువే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English