బోయపాటికి మామూలు డ్యామేజ్ కాదిది

బోయపాటికి మామూలు డ్యామేజ్ కాదిది

సినీ పరిశ్రమలో రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతుంటాయి. ఒక్క సినిమా ఫలితం ఒకరిని అందలమెక్కి కూర్చోబెడుతుంది. అలాగే ఒక సినిమా ఫలితం పాతాళానికి కూడా పడేస్తుంది. అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీనుకు ‘వినయ విదేయ రామ’ అలాంటి డ్యామేజీనే చేసినట్లుగా ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

మొన్నటిదాకా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా ఉన్న బోయపాటి.. ఇప్పుడు అందరికీ చేదైనట్లుగా కనిపిస్తున్నాడు. తెలుగు సినిమా ట్రెండ్ మారి అందరూ కొత్తదనం వైపు అడుగులేస్తున్న సమయంలో బోయపాటి మాత్రం ఫార్ములా సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగాడు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే.. ఇలాంటి రొటీన్ కథలతో సినిమాలు చేసేవాళ్లకు గట్టిగా ఒక ఎదురు దెబ్బ తగిలితే చాలు.. మొత్తం కథ మారిపోతుంది. ఇందుకు ఇండస్ట్రీలో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. తాజాగా ఈ కోవలోకి బోయపాటి చేరినట్లుగా కనిపిస్తున్నాడు.

ఇకపై బోయపాటి ఎంతమాత్రం రొటీన్ కథలతో సినిమాలు తీస్తే వర్కవుటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బాలయ్య ఎంత మాస్ హీరో అయినప్పటికీ.. ఆయనతో కూడా ఏదో కొంచెం డిఫరెంటుగానే ట్రై చేయాలి. ‘వినయ విధేయ రామ’తో బోయపాటి ఇమేజ్ మామూలుగా డ్యామేజ్ కాలేదు. ఈ స్థితిలో మామూలు సినిమా తీసి మెప్పించడం కుదరదు. ఏదో ప్రత్యేకంగా ట్రై చేయాలి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బోయపాటి ఎవరితో పని చేస్తాడన్నదీ ప్రశ్నార్థకంగా మారింది.

ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో కయ్యం పెట్టుకుంటే.. మనుగడ కష్టమవుతుంది. ఎవ్వరూ ఓపెన్‌గా చెప్పరు.. ఏమీ చెయ్యరు కానీ.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ‘వినయ విధేయ రామ’ బయ్యర్లకు నష్టపరిహారం అందించే విషయంలో బోయపాటి వ్యతిరేకత ప్రదర్శించడం, చరణ్, దానయ్యలతో కయ్యం పెట్టుకోవడం అతడికి చేటు చేసేదే.

మొన్నటి చరణ్ ప్రెస్ నోట్ ను బట్టి చూస్తే మెగా ఫ్యామిలీతో బోయపాటికి దాదాపు కట్ అయినట్లే కనిపిస్తోంది. ఇంతకుముందు బోయపాటితో పని చేయడానికి ఆసక్తి చూపించిన వాళ్లు.. ‘వినయ విదేయ రామ’ ఔట్ పుట్, దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి వెనుకంజ వేస్తున్నారు. మహేష్ బాబు, చిరంజీవిలతో సినిమాలుంటాయని బోయపాటి అన్నాడు కానీ.. అందుకు అవకాశం లేదు. బాలయ్య కూడా ఇంకోసారి బోయపాటితో సినిమా చేస్తాడా అన్నది సందేహమే. ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి వాళ్లతోనూ సినిమాలు వర్కవుట్ కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో బాలయ్యతో ఓ మెగా హిట్ కొడితే తప్ప బోయపాటి కెరీర్ గాడిన పడటం కష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English