‘యాత్ర’ను అక్కడ పట్టించుకుంటారా?

‘యాత్ర’ను అక్కడ పట్టించుకుంటారా?

కొంత విరామం తర్వాత తెలుగులో కాస్త చెప్పుకోదగ్గ సినిమా రిలీజవుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారమే థియేటర్లలోకి దిగుతోంది. దీనిపై ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. జనాలు మరీ ఎగబడి చూసే పరిస్థితి లేదు. అలాగని పూర్తిగా తీసిపడేసే సినిమా కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ బాగా డల్లుగా ఉన్న సమయంలో, పోటీ లేకుండా రావడం దీనికి కలిసొచ్చే విషయం. టాక్‌ను బట్టి సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు.

విశేషం ఏంటంటే ‘యాత్ర’ ఒకేసారి ఇంకో రెండు భాషల్లో రిలీజవుతోంది. మలయాళంతో పాటు తమిళంలోనూ ‘యాత్ర’ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించడంతో ఆటోమేటిగ్గా ఈ చిత్రాన్ని మలయాళంలోకి అనువాదం చేశారు. కానీ అక్కడ దీన్ని పెద్దగా ప్రమోట్ చేయకుండా ఏదో నామినల్‌గా రిలీజ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే మలయాళ వెర్షన్‌కు ఎలాంటి బజ్ కనిపించడం లేదు.

ఇక తమిళ వెర్షన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. అసలే అక్కడ అనువాదాలకు ఆదరణ అంతంతమాత్రంగా ఉంటుంది. ఇది తెలుగు వ్యక్తి కథ. పైగా హీరో మలయాళీ. మరి అక్కడ ఏమాత్రం ఆదరణ దక్కుతుంది అన్నది సందేహమే. హైదరాబాద్‌లో ‘యాత్ర’ తమిళ, మలయాళ వెర్షన్లను కొన్ని స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. మమ్ముట్టికి ఇక్కడున్న మలయాళీల్లో ఉన్న క్రేజ్ వల్ల బుకింగ్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. ఇంతకీ కేరళలో ఈ చిత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాలి. టాక్ బాగుంటే ఇక్కడా, అక్కడా సినిమా ఓ మోస్తరుగా ఆడే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English