వైఎస్ సినిమా.. దిల్ రాజు ధైర్యం

వైఎస్ సినిమా.. దిల్ రాజు ధైర్యం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర‘. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉంటుంది కాబట్టి.. దీనికి ఇండస్ట్రీ జనాల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఈ సినిమా గురించి స్పందిస్తే.. తమపై రాజకీయంగా ఒక ముద్ర పడుతుందేమో అన్న భయంతో అందరూ సైలెంటుగా ఉండిపోయారు. సినీ రంగం నుంచి వెళ్లి రాజకీయాలు చేసిన ఎన్టీఆర్ మీద సినిమా తీస్తేనే దానిపై వ్యూహాత్మక మౌనం పాటించిన ఇండస్ట్రీ జనాలు.. వైఎస్ సినిమా అంటే ఇంకెక్కడ స్పందిస్తారు. ఒక్క సుధీర్ బాబు మినహాయిస్తే ‘యాత్ర’ గురించి స్పందించిన ప్రముఖులెవరూ కనిపించరు. ఇలాంటి తరుణంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ధైర్యం చేశారు. ‘యాత్ర’ గురించి మాట్లాడటమే కాదు.. ఆ చిత్రాన్ని నైజాం, వైజాగ్ ఏరియాల్లో తనే డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు.

ఈ సంగతి కొంచెం ఆలస్యంగా వెల్లడైంది. ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో ఈ సంగతి వెల్లడిస్తూ.. ‘యాత్ర’ గురించి పాజిటివ్‌గా మాట్లాడాడు రాజు. ఈ రోజుల్లో ఏ సినిమాకైనా ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకం అని.. యాత్ర సినిమా విడుదలకు రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయని రాజు అన్నాడు. ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో అంత గొప్ప ఇమేజ్ ఉన్న నాయకుడు వైఎస్ అని.. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టమైన పాదయాత్ర మీద తీసిన ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నానని రాజు అన్నాడు. సినిమాలో భావోద్వేగాలు చాలా బాగా పండాయని రాజు చెప్పాడు. మరోవైపు నిర్మాత మాట్లాడుతూ ‘యాత్ర’ను రాజకీయ చిత్రంగా చూడొద్దని.. అన్ని రకాల ప్రేక్షకులకూ నచ్చుతుందని అన్నాడు. మొత్తానికి దిల్ రాజు హ్యాండ్ పడటం ‘యాత్ర’కు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి ‘యాత్ర’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English