కేజీఎఫ్-2లో క్రేజీ యాక్టర్

కేజీఎఫ్-2లో క్రేజీ యాక్టర్

కన్నడ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన చిత్రం ‘కేజీఎఫ్’. ఒక కన్నడ సినిమా కర్ణాటక దాటి వేరే ప్రాంతాల్లో రిలీజవ్వడమే గగనం అంటే.. ఈ చిత్రం వేరే నాలుగు భాషల్లో రిలీజై అన్ని చోట్లా సంచలన వసూళ్లు రాబట్టింది. కన్నడలో అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ హిట్ కంటే మూడు రెట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండు రోజుల కిందటే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ చిత్రం అక్కడ కూడా మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఇప్పుడు రిలీజైంది ‘కేజీఎఫ్’ తొలి ఛాప్టరే. ఇందులో ఇంకో అంకం కూడా ఉంది. ‘బాహుబలి’ తరహాలో దీన్ని కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. రెండో భాగానికి సంబంధించి ఆల్రెడీ కొంత చిత్రీకరణ జరిపారు. మిగతాది ఈ ఏడాదే పూర్తి చేసి వచ్చే సంవత్సరం రిలీజ్ చేయబోతున్నారు.

ఐతే తొలి భాగానికి అద్భుతమైన స్పందన రావడం.. హిందీలో సైతం పెద్ద విజయం సాధించడంతో.. రెండో భాగం స్థాయి పెంచడానికి ఒక ప్రత్యేక ఆకర్షణను జోడిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తాడట. ముందు ఈ ఆలోచన లేదు కానీ.. సినిమా సాధించిన విజయం చూశాక ఈ అడిషన్ చేస్తున్నారట. ఉత్తరాదిన భారీ వసూళ్లతో బాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షించింది ‘కేజీఎఫ్’. ‘బాహుబలి’ తర్వాత అక్కడి జనాల్ని బాగా ఆకర్షించిన దక్షిణాది చిత్రాల్లో ఇదొకటి. సంజయ్ దత్ నటిస్తే హిందీలో రెండో భాగానికి వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. భారీ పారితోషకం ఆఫర్ చేయడంతో సంజయ్ ఓకే అన్నట్లు తెలిసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యశ్ హీరో అన్న సంగతి తెలిసిందే. ఇంకా థియేటర్లలో ఉన్న ఈ చిత్రం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English