క్రిష్ వల్ల ‘మణికర్ణిక‘కు నష్టమా?

క్రిష్ వల్ల ‘మణికర్ణిక‘కు నష్టమా?

‘మణికర్ణిక‘ సినిమా ఎలా ఉందనే దాని కంటే ఈ సినిమాకు డైరెక్షన్ క్రెడిట్ ఎవరది అనే విషయంపైనే ఎక్కువ చర్చ నడిచింది. దీని మీద పది పన్నెండు రోజులుగా పెద్ద గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటు కంగనా.. అటు క్రిష్.. ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలే చేసుకున్నారు. తమ సినిమాకు క్రిష్ నష్టం చేస్తున్నాడంటూ స్వయంగా నిర్మాత కమల్ జైన్ మండిపడటం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా కంగనా సైతం ఇవే వ్యాఖ్యలు చేసింది. ఐతే ఒక దర్శకుడి విజన్, స్క్రిప్టు నమ్మి బాధ్యతలు అప్పగించాక.. అతను తీసిన దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే అతడికే చెప్పి మార్పులు చేర్పులు చేయించే ప్రయత్నం చేయాలి. కానీ ఈ విషయంలో దాగుడు మూతలు ఆడి.. అవమానకరంగా వ్యవహరించి అతను ఈ సినిమా నుంచి తప్పుకునేలా చేశారు. తర్వాత అతనే తప్పుకున్నాడని ప్రచారం చేశారు. ఇది చాలదన్నట్లు క్రిష్ పారితోషకం కూడా పూర్తిగా ఇవ్వలేదని కూడా తెలుస్తోంది.

చిత్ర బృందంలో చాలామంది సినిమాలో మెజారిటీ పార్ట్ క్రిష్‌యే షూట్ చేశాడంటున్నారు. కానీ కంగనా అండ్ కో మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుతోంది. ఆ సంగతలా వదిలేస్తే.. రిలీజ్ తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి క్రిష్ మాట్లాడుతుంటే.. అతను సినిమాకు నష్టం చేస్తున్నాడంటూ కమల్, కంగనా విమర్శించారు. కానీ క్రిష్ వల్ల సినిమాకు రిలీజ్ తర్వాత జరిగిన నష్టమేమీ లేదు.

క్రిష్ గళం విప్పడం.. దానికి కంగన వర్గం బదులివ్వడం.. ఈ వాదోపవాదాలతో సినిమాకు మంచి పబ్లిసిటీనే వచ్చింది. అంతే తప్ప క్రిష్ వల్ల రిలీజ్ తర్వాత వచ్చిన నష్టమేమీ లేదు. సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. తర్వాత ఆశించిన వసూళ్లు రావట్లేదు. బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉంది. సినిమాకు నష్టాలు తప్పవనిపిస్తోంది. సినిమా ఆడట్లేదంటే అందుకు క్రిష్ ఎంతమాత్రం కారణం లేదు. క్రిష్ చెడగొట్టి పెట్టిన సినిమాను తాను అద్భుతంగా మలిచానని కంగనా అంటోంది. కాబట్టి ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ప్రతికూల ఫలితం ఎదురైతే ఆమే బాధ్యురాలు తప్ప.. అతను విమర్శలు చేయడం వల్ల సినిమాకు నష్టం జరుగుతోందనడంలో అర్థం లేదసలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English