రెహమాన్ అంతగా చెబుతున్నాడంటే..

రెహమాన్ అంతగా చెబుతున్నాడంటే..

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ తాను పని చేస్తున్న, చేయబోయే సినిమాల గురించి పెద్దగా మాట్లాడడు. ఎంత ఎగ్జైటింగ్ ప్రాజెక్టులో పని చేసినా.. తాను మాత్రం బయట ఎక్కడా దాని గురించి ఎగ్జైట్ అవ్వడు. అలాంటివాడు.. తాను కొత్తగా కమిట్ అయిన విజయ్ సినిమా గురించి ఓ రేంజిలో చెబుతున్నాడు. గత ఏడాది దీపావళికి ‘సర్కార్‘ సినిమాతో పలకరించిన విజయ్.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసేందే.

ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘తెరి‘, ‘మెర్శల్‘ లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. ఇందులో ‘మెర్శల్‘కు రెహమానే సంగీతం అందించాడు. చాలా కాలం తర్వాత విజయ్ సినిమాకు పని చేసిన రెహమాన్.. తన సంగీతంతో సినిమాకు బాగానే ఉపయోగపడ్డాడు. ఇప్పుడు విజయ్-అట్లీల కొత్త సినిమాకు కూడా ఆయనే సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని.. విజయ్ ఇందులో ఫుట్ బాల్ కోచ్ పాత్రలో కనిపించబోతున్నాడని ఇంతకుముందే సమాచారం బయటికి వచ్చింది. తాజాగా రెహమాన్ మాటల్ని బట్టి చూస్తుంటే కూడా ఇదొక స్పోర్ట్స్ డ్రామా అనే విషయం స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని తాను పని చేసిన ‘లగాన్‘, ‘పీలే’ లాంటి గొప్ప చిత్రాలతో పోల్చాడు రెహమాన్. ‘లగాన్‘ ఒకప్పుడు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఇండియాలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో అదొకటి.

ఇక రెహమాన్ పని చేసిన హాలీవుడ్ మూవీ ‘పీలే‘ కూడా గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది.ఇంతకుముందు ‘తెరి‘, ‘మెర్శల్‘ లాంటి సగటు కమర్షియల్ సినిమాలు తీసిన అట్లీ డైరెక్ట్ చేయబోయే చిత్రాన్ని ఇలాంటి క్లాసిక్స్‌తో రెహమాన్ పోల్చడం ఒకింత ఆశ్చర్యపరిచేదే. అంతే కాదు.. దక్షిణాదిన తాను ఇప్పటిదాకా ఇలాంటి కథ వినలేదని కూడా రెహమాన్ అన్నాడు. అతను ఈ రేంజిలో చెబుతున్నాడంటే.. ఇందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English