‌సెంటిమెంటు కోసమే సైరాలో ఆమె

‌సెంటిమెంటు కోసమే సైరాలో ఆమె

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా.. అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కుతున్న సినిమా *సైరా న‌ర‌సింహారెడ్డి*. ఈ చిత్రానికి చిరునే పెద్ద ఆక‌ర్ష‌ణ అంటే.. ఆయ‌న‌కు దీటుగా భారీ తారాగ‌ణం ఉంది ఇందులో. అమితాబ్ బ‌చ్చ‌న్, జ‌గ‌ప‌తిబాబు, కిచ్చా సుదీప, విజ‌య్ సేతుప‌తి లాంటి పెద్ద న‌టులున్నారు. సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో.. త‌మ‌న్నా కూడా ఓ స్పెష‌ల్ రోల్ చేస్తోంది. వీళ్లంద‌రూ చాల‌ద‌న్న‌ట్లు మ‌రో లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క‌ను కూడా ఇందులో ఓ ప్ర‌త్యేక పాత్ర కోసం తీసుకున్న‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి.

అస‌లీ సినిమాకు ప్ర‌ధాన క‌థానాయిక‌గా అనుష్క‌నే తీసుకోవాల‌నుకున్నారు. కానీ గ‌తంతో పోలిస్తే అనుష్క‌లో గ్లామ‌ర్ త‌గ్గ‌డం.. *సైజ్ జీరో* ప్ర‌భావం నుంచి ఆమె పూర్తిగా బ‌య‌ట ప‌డ‌క‌పోవ‌డంతో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు వార్త‌లొచ్చాయి. పైగా న‌య‌న‌తార మంచి ఫాంలో ఉండ‌టంతో ఆమెనే ఫైన‌లైజ్ చేశారు. ఇంకో పాత్ర‌కు త‌మ‌న్నాను తీసుకున్నారు. ఐతే అనుష్క‌ను తీసుకుంటే సినిమాకు క‌లిసొస్తుంద‌న్న ఆలోచ‌న మాత్రం చిత్ర బృందంలో వీడిపోలేదు. చారిత్ర‌క నేప‌థ్యంలో ఉన్న‌.. భారీ బ‌డ్జెట్ సినిమాల్లో అనుష్క న‌టిస్తే క‌చ్చితంగా విజ‌య‌వంతం అవుతుంద‌న్న అభిప్రాయం ఇండ‌స్ట్రీ జ‌నాల్లో, ప్రేక్ష‌కుల్లో ఉంది.

అరుంధ‌తి.. బాహుబ‌లి.. రుద్ర‌మ‌దేవి లాంటి సినిమాలు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. అనుష్క ఈ సినిమాల‌న్నింటికీ ఎంతో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఆమె స్టేచ‌ర్ పెంచిన సినిమాలివి. ఇప్పుడు *సైరా*లో కూడా అనుష్క న‌టిస్తే వాటి త‌ర‌హాలోనే ఇది కూడా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని భావించి.. ఆమెను ఓ ప్ర‌త్యేక పాత్రకు తీసుకున్నార‌ట‌. ఆమె రోల్ సినిమాలో స‌ర్ప్రైజ్ అని అంటున్నారు. త్వ‌ర‌లోనే అనుష్క పాత్ర తాలూకు లుక్‌ను వ‌దులుతార‌ని కూడా చెబుతున్నారు. రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న *సైరా* ఈ ఏడాది ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English