ఇండియా ఓటమికి షమి బాధ్యుడా?

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. పాకిస్థాన్‌పై వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లో ఎప్పుడూ ఓడిన చరిత్రే లేని భారత జట్టు.. ఆదివారం పాకిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. ప్రపంచకప్ అనగానే ఒక ఫోబియాలో పడిపోయి.. తీవ్ర ఒత్తిడికి గురై.. భారత్‌కు మ్యాచ్ అప్పగించేయడం పాక్‌కు అలవాటు. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా జరిగింది. భారత జట్టే ఒత్తిడిలో పడింది. పాక్ చేతిలో ఓటమే తట్టుకోలేనిదంటే.. మరీ దారుణంగా 10 వికెట్ల తేడాతో పరాభవం చవిచూడటం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

ఐతే గెలిచినపుడు జట్టును తెగ పొగిడేసి.. ఓడినపుడు దూషించడం ఓ వర్గం అభిమానులకు అలవాటే. ఐతే ఈ క్రమంలో కొందరు శ్రుతి మించి వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు ఓటమికి బాధ్యుడిగా షమిని చూపిస్తూ అతడి మీద సోషల్ మీడియాలో కొందరు విరుచుకుపడిపోతున్నారు.

భారత జట్టులో ప్రస్తుతం ఉన్న ఏకైక ముస్లిం క్రికెటర్ షమినే. ఐతే షమిని సగటు అభిమాని మతం దృష్టితో ఎప్పుడూ చూడడు. షమి సైతం ఎప్పుడూ ఆ భావనను చూపించడు. కానీ విచిత్రంగా ఇప్పుడు షమిని ఓ వర్గం నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. ఓటమికి జట్టు మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటే.. షమినే విలన్ని చేస్తున్నారు. నువ్వు ముస్లింవి.. ఇక్కడెందుకున్నావ్.. పాకిస్థాన్‌కు వెళ్లి ఆడుకో అని.. వార్మప్ మ్యాచ్‌లో చెలరేగిన షమి.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కావాలనే పేలవ ప్రదర్శన చేశాడని.. ఇండియన్ టీంలో పాకిస్థానీ ప్లేయర్ ఉన్నాడని.. ఇలా రకరకాల కామెంట్లతో అతణ్ని దూషిస్తున్నారు. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.

ఇదంతా బీజేపీ భక్తుల పనే అని.. వాళ్లకు ముస్లింలను టార్గెట్ చేయడం అలవాటే అని లిబరల్స్ ముద్ర ఉన్న వాళ్లు మండిపడుతుంటే.. ఎవరో కొందరు సోషల్ మీడియాలో చేసిన కామెంట్లకు మొత్తంగా హిందువులను, బీజేపీ మద్దతుదారులను నిందించడం ఏంటని.. అసలు కూతురి పుట్టిన రోజు వేడుకలు చేయడం ఇస్లాం నిబంధనలకు విరుద్ధం అంటూ షమి మీద చాందసవాదులు విరుచుకుపడ్డపుడు వీళ్లంతా ఏమయ్యారని ఇంకో వర్గం వారు ఎదురు దాడి చేస్తున్నారు. మొత్తానికి పాక్ చేతిలో భారత్ ఓటమి నేపథ్యంలో సంబంధం లేని విషయాల మీద అర్థ రహిత చర్చ జరుగుతుండటం నివ్వెర పరుస్తోంది.