క్లీన్ ఇమేజ్ హీరో.. వివాదంలో చిక్కుకున్నాడు

క్లీన్ ఇమేజ్ హీరో.. వివాదంలో చిక్కుకున్నాడు

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. కెరీర్ ఆరంభంలో చేసినవి నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్. అయితేనేం.. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకున్నాడు. నటుడిగా చాలా తక్కువ కాలంలో గొప్ప పేరు సంపాదించాడు. ఇప్పుడు దక్షిణాదిన అత్యంత గొప్ప నటుల్లో ఒకడిగా.. బిజియెస్ట్ ఆర్టిస్టుల్లో ఒకడిగా మారాడు.

ఈ ఉపోద్ఘాతమంతా విజయ్ సేతుపతి గురించే. గత దశాబ్ద కాలంలో సేతుపతి నటుడిగా ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. ఈ తరంలో ఇలాంటి విలక్షణ నటుడు మరొకరు కనిపించరు. వేరే భాషల వాళ్లకూ అతడి ప్రతిభ ఏంటో తెలిసిందే. అప్పుడే అతను లెజెండరీ స్టేటస్ సంపాదించేశాడు. నటుడిగానే కాక వ్యక్తిగానూ అతడికి మంచి ఇమేజ్ ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం అతడిపై అభిమానాన్ని మరింత పెంచింది.

ఇప్పటిదాకా విజయ్ సేతుపతి చుట్టూ ఏ వివాదం లేదు. మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది అతడికి. అలాంటి వాడు ఓ అనవసర వివాదంలో చిక్కుకున్నాడు. శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై కొన్ని నెలల కిందట సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. ఈ తీర్పును మెజారిటీ జనాలు వ్యతిరేకించారు. దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఐతే జనాల సెంటిమెంట్లను పట్టించుకోకుండా కోర్టు తీర్పును శిరసావహిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్.. మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లడానికి పోలీసు భద్రత కల్పించడం విమర్శలకు దారి తీసింది. దీన్ని మెజారిటీ జనాలు నిరసించారు.

ఐతే విజయ్ సేతుపతి తాజాగా ఒక సినిమా చిత్రీకరణ కోసం కేరళకు వెళ్లి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో విజయన్ ను పొగిడాడు. తాను విజయన్ కు అభిమానిని అన్నాడు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో విజయ్.. విజయన్ ను పొగడ్డం వివాదాస్పదమైంది. కేరళతో పాటు అతడి సొంత రాష్ట్రమైన తమిళనాడులోనూ విజయ్ వ్యాఖ్యలపై వివాదం రేగింది. అతడిని సోషల్ మీడియాలోనూ జనాలు తప్పుబడుతున్నారు. ఏదో యధాలాపంగా మాట్లాడుతూ విజయ్ ఇలా మాట్లాడినట్లు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English