తెలుగ‌మ్మాయికి ఒక మంచి ఛాన్స్

తెలుగ‌మ్మాయికి ఒక మంచి ఛాన్స్

ఎంత అందం ఉన్నా.. ఎంత టాలెంట్ ఉన్నా.. తెలుగ‌మ్మాయిల‌కు హీరోయిన్లుగా ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మే. మ‌న హీరోయిన్ల‌ను పెట్టుకుంటే గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌డానికి ఒప్పుకోర‌ని.. ఇంకేవో ప‌రిమితులు పెడ‌తార‌ని భావించి ఫిలిం మేక‌ర్స్ వాళ్ల వైపు చూడ‌రు. ప‌ర భాషా హీరోయిన్ల‌తో వేరే ర‌క‌మైన ఇబ్బందులున్నా స‌రే.. వారికే ఓటేస్తుంటారు.

ఈ మ‌ధ్యే "శుభ‌లేఖ‌లు".. "హుషారు" సినిమాల‌తో పేరు సంపాదించిన ప్రియ వ‌డ్ల‌మానికి ఛాన్సులిద్దామ‌ని భావించి.. ఆమె తెలుగ‌మ్మాయి అనుకుని వెనుకంజ వేశార‌ట కొంద‌రు నిర్మాత‌లు. తెలుగు హీరోయిన్ల విష‌యంలో ఇండ‌స్ట్రీ దృష్టి కోణం ఎలా ఉంటుందో చెప్ప‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఇలాంటి త‌రుణంలో ఈషా రెబ్బా మిగ‌తా తెలుగ‌మ్మాయిల కంటే కొంచెం మెరుగైన స్థితిలోనే ఉంది. తొలి సినిమా "అంత‌కుముందు ఆ త‌రువాత‌"తో స‌త్తా చాటిన ఈషా.. ఓ మోస్త‌రు అవ‌కాశాల‌తో ఏదో అలా బండి నెట్టుకొస్తోంది. అంత‌గా ప్రాధాన్యం లేని పాత్రే అయినా.. "అర‌వింద స‌మేత‌" లాంటి పెద్ద చిత్రంలో ఆమె అవ‌కాశం ద‌క్కించుకుంది.

తాజాగా ఈషాకు ఒక క్రేజీ ప్రాజెక్టులో అవ‌కాశం ద‌క్కిన‌ట్లు స‌మాచారం. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌లే మొద‌లైన "వాల్మీకి" చిత్రంలో ఆమె క‌థానాయిక‌గా ఎంపికైన‌ట్లు తెలుస్తోంది. త‌మిళంలో ల‌క్ష్మీ మీన‌న్ పోషించిన పాత్ర‌లో ఈషా క‌నిపించ‌నుంది. ఈ క‌థ‌లో హీరోయిన్‌ది ముఖ్య పాత్రే. క‌థ‌లో మ‌లుపుల‌కు ఆమె పాత్ర కార‌ణ‌మ‌వుతుంది.

ల‌క్ష్మీ త‌మిళంలో డీగ్లామ‌ర‌స్ రోల్‌లో క‌నిపించింది. మ‌రి ఈషాను ఎలా చూపిస్తారో చూడాలి. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ పాత్ర విష‌యంలో స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ముందు బాబీ సింహా చేసిన విల‌న్ పాత్ర‌లో అత‌ను క‌నిపిస్తాడ‌ని అన్నారు. ఆ త‌ర్వాత సిద్దార్థ్ పాత్ర అని ప్ర‌చారం జ‌రిగింది. ఐతే తాజా స‌మాచారం ప్ర‌కారం వ‌రుణ్ చేస్తున్న‌ది ప్ర‌తినాయ‌క పాత్రే అని స‌మాచారం.

సిద్ధు చేసిన హీరో పాత్ర‌లో శ్రీవిష్ణు క‌నిపించే అవ‌కాశాలున్నాయ‌ట‌. ముందు ఈ పాత్ర‌కు నాగ‌శౌర్య‌ను అనుకున్నాడు హ‌రీష్‌. కానీ త‌మిళంలోనే హీరో పాత్ర కొంచెం త‌క్కువ‌గా ఉండ‌గా.. తెలుగులో విల‌న్ పాత్ర‌నే మ‌రింత పెంచి, హీరోకు ప్రాధాన్యం మ‌రింత త‌గ్గించార‌ని తెలిసి శౌర్య నో అన్నాడ‌ట‌. దీంతో శ్రీవిష్ణును తీసుకున్నార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English