ధనుష్‌ సినిమా మళ్లీ ఓటీటీకి!

కరోనా కారణంగా థియేటర్లు మూతబడ్డాక చాలా సినిమాల్ని ఓటీటీలు ఆదుకున్నాయి. తెలుగు స్టార్‌‌ హీరోలు ఓటీటీకి వెళ్లడానికి అంత ఇష్టపడకపోయినా.. సూర్య, ధనుష్‌ లాంటి కోలీవుడ్‌ స్టార్స్ మాత్రం తమ సినిమాలను డిజిటల్ రిలీజ్ చేశారు. అయితే ఈ విషయంలో సూర్య సక్సెస్ అయినట్టుగా ధనుష్‌ కాలేదు. అయినా కూడా ధనుష్ సినిమా మరోసారి ఓటీటీ బాట పట్టడం అతని ఫ్యాన్స్‌ని కంగారు పెడుతోంది.

ధనుష్ నటిస్తున్న ‘మారన్’ మూవీ డిజిటల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ మూవీని మంచి ధర చెల్లించి డిస్నీ హాట్‌స్టార్ కొనుక్కుంది. త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. హింసను ఇష్టపడని హీరోకి ఓ పెద్ద అన్యాయం జరుగుతుంది. అప్పుడతను ఎలా రియాక్టయ్యాడు, హింసే తగిన మార్గమని ఎలా డిసైడయ్యాడు అనేది ఈ సినిమా కథ. ఆల్రెడీ పోస్టర్లతో అంచనాలను పెంచారు. మరి ఓటీటీలో రిలీజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియక ధనుష్ అభిమానులు కంగారు పడుతున్నారు.

తను నటించిన ‘జగమే తంత్రం’ కూడా ఓటీటీలోనే రిలీజయ్యింది. ఆ సినిమా థియేటర్స్‌లో వర్కవుటవదని అనలిస్టులు చెప్పడం వల్లే నిర్మాతలు ఆ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో టాక్ నడిచింది. అయితే పెద్ద హీరో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడమేంటని ఎగ్జిబిటర్లు గొడవ చేశారు. కానీ మూవీ డిజాస్టర్ కావడంతో థియేటర్స్‌లో విడుదల చేయకపోవడమే మంచిదయ్యింది అనుకున్నారంతా.

ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీకే తీసుకెళ్లడం చూస్తుంటే లేనిసోని అనుమానాలు వస్తున్నాయి. ఇది కూడా హిట్‌ అయ్యే చాన్స్ లేని సినిమాయేనా, అందుకే థియేటర్లు తెరుచుకున్నాక కూడా ధైర్యం చేయలేకపోతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఫ్యాన్స్‌కి మాత్రం తమ ఫేవరేట్ హీరో సినిమాలు ఇలా ఓటీటీ దగ్గర క్యూ కట్టడం నచ్చడం లేదు. థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలంటూ ఆల్రెడీ సోషల్‌ మీడియాలో హడావుడి మొదలెట్టారు. నిర్మాతలు ఏమంటారో చూడాలి మరి.