క్యాన్స‌ర్‌ను జ‌యించింది.. ప‌నిలోకి వ‌చ్చేసింది

క్యాన్స‌ర్‌ను జ‌యించింది.. ప‌నిలోకి వ‌చ్చేసింది

తెర‌పై త‌మ అందంతో, న‌ట‌న‌తో అల‌రించిన హీరోయిన్లు పెద్ద అనారోగ్యం బారిన ప‌డితే.. అభిమానుల‌కు విన‌డానికే ఏదోలా ఉంటుంది. అందులోనూ క్యాన్స‌ర్ లాంటి ప్రాణాంతక వ్యాధి ఉంద‌ని తెలిస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్టం. హిందీతో పాటు తెలుగులోనూ మంచి మంచి సినిమాలు చేసి అభిమానుల్ని సంపాదించుకున్న సోనాలి బింద్రేకి ఈ జ‌బ్బు ఉంద‌ని కొన్ని నెల‌ల కింద‌ట బ‌య‌ట‌ప‌డిన‌పుడు అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు.

చికిత్స‌లో భాగంగా జుట్టంతా తీయించుకుని క‌నిపించిన సోనాలిని చూసి అభిమానులు త‌ట్టుకోలేక‌పోయారు. ఐతే జుట్టు పోతేనేం.. ఆమెకు జ‌రిగిన చికిత్స విజ‌యవంత‌మైంది. సోనాలి క్యాన్స‌ర్ నుంచి కోలుకుంది. మామూలు మ‌నిషైంది. న్యూయార్క్‌లో చికిత్స చేయించుకుని ఇటీవలే ముంబయి చేరుకున్న సోనాలి.. ఇప్పుడు ప‌ని కూడా మొద‌లుపెట్టేసింది. ఆమె షూటింగ్ కోసం స్టూడియోకు వ‌చ్చింది.

చాలా కాలం తర్వాత తాను షూటింగ్ కోసం సెట్‌లోకి అడుగుపెట్టినట్లు వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను పోస్ట్ చేసింది సోనాలి. ఇదో కలలా ఉంది.. మళ్లీ పనిలోకి అడుగు పెట్టినప్పుడు.. కెమెరా ముందు నిలబడినప్పుడు కలిగే ఆ ఫీలింగ్‌ను చెప్పడానికి మాటలు సరిపోవు అంటూ ఉద్వేగానికి గురైంది సోనాలి. ఐతే సోనాలి ప్ర‌స్తుతం ఏదైనా సినిమాలో న‌టిస్తోందా.. లేక ఏదైనా యాడ్ కోసం కెమెరా ముందుకు వ‌చ్చిందా అన్న‌ది తెలియ‌డం లేదు.

తాను క్యాన్స‌ర్ బారిన ప‌డ‌టానికి ముందు సోనాలి ‘ఇండియాస్‌ బెస్ట్‌ డ్రామేబాజ్‌’ అనే హిందీ టీవీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించేది. అనారోగ్యానికి గుర‌య్యాక ఈ షో నుంచి తప్పుకుంది. బ‌హుశా ఇప్పుడు ఆ షో కోస‌మే సెట్‌కు వ‌చ్చి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. సోనాలి త్వరలోనే రెండో విడత చికిత్స కోసం మళ్లీ న్యూయార్క్‌కు వెళ్ల‌నుంది. బేసిగ్గా ముంబ‌యి భామ అయిన‌ప్ప‌టికీ బాలీవుడ్లో కంటే టాలీవుడ్లోనే సోనాలికి పెద్ద విజ‌యాలున్నాయి. మురారి, ఇంద్ర‌, మ‌న్మ‌థుడు లాంటి సినిమాల‌తో ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌పై చెర‌గ‌ని ముద్ర వేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English