హ‌రీష్.. అంత వీజీ కాద‌బ్బా!

 హ‌రీష్.. అంత వీజీ కాద‌బ్బా!

ఒక సినిమాకు వ‌చ్చే ఓపెనింగ్స్‌ను బ‌ట్టి దాని ఫ‌లితంపై ఒక అంచ‌నాకు వ‌చ్చేయ‌లేం. విడుద‌ల‌కు ముందున్న హైప్ వ‌ల్ల కావ‌చ్చు.. మంచి సీజ‌న్లో రిలీజ్ చేయ‌డం వ‌ల్ల కావ‌చ్చు.. పోటీలో స‌రైన సినిమాలు లేక‌పోవ‌డం వ‌ల్ల కావ‌చ్చు.. కొన్నిసార్లు టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు వ‌స్తుంటాయి. ఐతే వీకెండ్ అయ్యాక వ‌సూళ్లెలా ఉన్నాయి.. ఫుల్ ర‌న్లో ఎంత వ‌సూలు చేసింది.. పెట్టుబ‌డిలో ఏమాత్రం రిక‌వ‌ర్ చేసింది అన్న‌దాన్ని బ‌ట్టి సినిమా అస‌లు ఫ‌లితం తేలుతుంది.

ఏడాదిన్న‌ర కిందట రిలీజైన "దువ్వాడ జ‌గ‌న్నాథం" సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ చిత్ర బృంద‌మంతా డ‌బ్బా కొట్టుకుంది. "ఖైదీ నంబ‌ర్ 150" క‌లెక్ష‌న్ల‌ను దాటేసిందంటూ ప్రచారం చేసుకున్నారు. సినిమాను విమ‌ర్శించిన వాళ్లంద‌రి పైగా ఎదురు దాడి చేశారు. కానీ చివ‌రికి ఏమైంది? ఆ సినిమా బ‌య్య‌ర్ల‌కు 20 శాతానికి పైగా న‌ష్టాలు తెచ్చిపెట్టింది. వేరే సినిమా ద్వారా దిల్ రాజు బ‌య్య‌ర్ల‌కు సెటిల్ చేయాల్సి వ‌చ్చింది. సినిమా రిలీజైన కొన్ని నెల‌ల త‌ర్వాత కానీ.. ద‌ర్శ‌కుడు హ‌రీష్‌కు తన సినిమా ఫ‌లిత‌మేంటో బోధ ప‌డ‌లేదు.

"డీజే" రిలీజైన ఏడాదిన్న‌ర‌కు కానీ హ‌రీష్ త‌న త‌ర్వాతి సినిమాను మొద‌లుపెట్ట‌లేదు. దిల్ రాజు సైతం అత‌డిని న‌మ్మ‌లేదు. "దాగుడు మూత‌లు"కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌లేదు. చివ‌రికి ఏ దారీ క‌న‌బ‌డ‌క త‌మిళ హిట్ మూవీ "జిగ‌ర్ తండ‌"ను రీమేక్ చేయ‌డానికి పూనుకున్నాడు. గ‌తంలో "ద‌బంగ్"ను హ‌రీష్‌ "గ‌బ్బ‌ర్ సింగ్"గా మార్చిన తీరు ప్ర‌శంస‌లందుకుంది. ఐతే అది ప‌క్కా మాస్ మ‌సాలా సినిమా. హ‌రీష్‌కు బాగానే సెట్ట‌యింది. కానీ "జిగర్ తండ‌" ఒక ప్ర‌యోగం. దాన్ని ఉన్న‌దున్న‌ట్లుగా తీయాలా.. మార్పులు చేర్పులు చేస్తే మంచిదా అన్న‌ది ఎవ్వ‌రూ చెప్ప‌లేదు. హ‌రీష్ అయితే ఉన్న‌దున్న‌ట్లుగా తీసే అవ‌కాశం లేదు. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లుగా.. త‌న ముద్ర చూపించేలా మార్చిన‌ట్లు చెబుతున్నారు.

మ‌రి అవి ప్రేక్ష‌కుల‌కు ఏమేర‌కు రుచిస్తాయో చూడాలి. మ‌రోవైపు "డీజే" టైంలో ఈ సినిమాను విమ‌ర్శించిన అంద‌రికీ చివుక్కుమ‌నేలా సెటైర్లు వేశాడు హ‌రీష్‌. కాబ‌ట్టి ఆ ప్ర‌భావం తాలూకు నెగెటివిటీ త‌ర్వాతి సినిమాపై ఉంటుంది. ఈ నేప‌థ్యంలో "వాల్మీకి"తో అంద‌రినీ మెప్పించ‌డం హ‌రీష్‌కు పెను స‌వాలే. మ‌రి అత‌నేం చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English